-మూడు దశల్లో 230 ఎకరాల్లో ఇండో–కొరియన్ సంయుక్త పరిశ్రమ ఏర్పాటు
-700 మందికి ప్రత్యక్షంగా.. 5 వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు
సత్య వెలుగు న్యూస్ | నవంబర్ 12 | నాయుడుపేట: ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పారిశ్రామిక రంగంలో మరో భారీ పెట్టుబడికి వేదిక కానుంది. సుమారు రూ.4 వేల కోట్ల పెట్టుబడితో ఇండో–కొరియన్ భాగస్వామ్యంతో భారీ బ్యాటరీ ముడిపదార్థాల తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. కార్బన్ రిసోర్సెస్ సంస్థ, దక్షిణ కొరియాకు చెందిన కాస్మో ఏఎం అండ్ టీ సంయుక్త భాగస్వామ్యంతో ఈ పరిశ్రమను స్థాపించనున్నారు.
మొత్తం 230 ఎకరాల విస్తీర్ణంలో మూడు దశలుగా పరిశ్రమ నిర్మాణం చేపట్టనున్నారు. 2031 నాటికి పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభించే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించారు. ఈ పరిశ్రమలో ఏటా 1.8 లక్షల టన్నుల చొప్పున రెండు రకాల బ్యాటరీ ముడిపదార్థాలను తయారు చేయనున్నారు.
ఈ పరిశ్రమ ద్వారా సుమారు 700 మందికి ప్రత్యక్షంగా, 3,500 నుంచి 5 వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. దీంతో నాయుడుపేటతో పాటు పరిసర ప్రాంతాల పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధికి మరింత ఊతం లభించనుంది.
బ్యాటరీల నాణ్యత పరీక్షలు, రీసైక్లింగ్‌కు సంబంధించిన పరిశోధనల కోసం ఐఐటీ తిరుపతితో కలిసి పనిచేయాలని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సూచించారు. పరిశ్రమకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనల అభివృద్ధికి విద్యాసంస్థల సహకారం కీలకమని ఆయన పేర్కొన్నారు.
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, బ్యాటరీ ఉత్పత్తి రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
నాయుడుపేటలో ఈ భారీ పరిశ్రమ ఏర్పాటు కానుండటంతో స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పారిశ్రామిక పెట్టుబడులకు కొత్త మార్గాలు తెరుచుకోనున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే నాయుడుపేట పారిశ్రామిక రంగానికి మరింత గుర్తింపు లభించే అవకాశం ఉంది.