sathyavelugu.com
Date of Publish : 03 November 2026, 10:39 pm Posted by : Dr.K.Suresh Editor

నాపై నమ్మకంతో విజయం అందించిన నాయుడుపేట ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటా: తంబిరెడ్డి రాజేశ్వరమ్మ

సత్య వెలుగు న్యూస్ – నవంబర్ 3, నాయుడుపేట: నాయుడుపేట మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఘన విజయం అందించిన పట్టణ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మ తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఓటు వేసి విజయాన్ని అందించిన ప్రతి ఒక్క ఓటరుకు, నాయుడుపేట పట్టణ ప్రజలకు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు, ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, చైర్‌పర్సన్‌గా తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు. నాయుడుపేట పట్టణ అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ సమానంగా గౌరవిస్తూ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు.

తన విజయానికి అండగా నిలిచి, వెన్నంటి నడిపించిన సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు కిలివేటి సంజీవయ్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ విజయం తనపై నాయుడుపేట ప్రజలు ఉంచిన నమ్మకానికి నిదర్శనమని, ఈ విజయాన్ని పట్టణ ప్రజలందరికీ అంకితం చేస్తున్నానని తంబిరెడ్డి రాజేశ్వరమ్మ పేర్కొన్నారు.

నాయుడుపేట ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.