sathyavelugu.com
Date of Publish : 01 November 2026, 10:02 pm Posted by : Dr.K.Suresh Editor

నాయుడుపేట మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం

-71.13 శాతం పోలింగ్ నమోదు..

  -మహిళా ఓటర్లదే పైచేయి

సత్య వెలుగు న్యూస్ | నవంబర్ 1 | నాయుడుపేట:నాయుడుపేట మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అత్యంత ప్రశాంత వాతావరణంలో ముగిసింది. పట్టణంలోని మొత్తం 32 వార్డుల పరిధిలో ఏర్పాటు చేసిన 64 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ప్రజాస్వామ్య హక్కును ఉత్సాహంగా వినియోగించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీసుల, ఎన్నికల అధికారుల పటిష్ట పర్యవేక్షణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగింది.

37,100 మంది ఓటర్లలో 26,389 మంది ఓటింగ్

మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డులకు సంబంధించి ఎన్నికల అధికారులు విడుదల చేసిన తుది నివేదిక ప్రకారం మొత్తం 37,100 మంది ఓటర్లకు గాను 26,389 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో పట్టణంలో మొత్తం 71.13 శాతం పోలింగ్ నమోదైంది.

మహిళా ఓటర్లదే అధిక భాగస్వామ్యం

పోలింగ్ వివరాలను పరిశీలిస్తే పురుష ఓటర్లు 12,493 మంది ఓటు వేయగా, మహిళా ఓటర్లు 13,894 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు అధిక సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొనడం విశేషంగా నిలిచింది.

8వ వార్డులో అత్యధిక పోలింగ్ నమోదు

పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతం గణనీయంగా నమోదైంది. ముఖ్యంగా 8వ వార్డు పరిధిలోని 8/2 పోలింగ్ కేంద్రంలో అత్యధికంగా 88.60 శాతం పోలింగ్ నమోదైంది. అదేవిధంగా 6/1 పోలింగ్ కేంద్రంలో 85.49 శాతం, 7/1 పోలింగ్ కేంద్రంలో 84.71 శాతం పోలింగ్ నమోదైంది.

ఫలితాలపై పట్టణంలో ఉత్కంఠ

పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో ఎన్నికల అధికారులు బ్యాలెట్ బాక్సులను భద్రపరిచారు. ఎన్నికల నిర్వహణ విజయవంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

అయితే ఈ ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి, ఏ అభ్యర్థులకు మద్దతు పలికారనే అంశంపై పట్టణవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఓటర్ల తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటుందో తెలుసుకోవాలనే ఉత్కంఠ అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తల్లో నెలకొంది.

*సత్య వెలుగు న్యూస్ – ప్రజల గొంతుక, నిజాల వెలుగులో!*