sathyavelugu.com
Date of Publish : 05 November 2026, 1:25 pm Posted by : Dr.K.Suresh Editor

రోడ్డు సౌకర్యం కల్పించలేదంటూ కమ్మవారిపాలెం గ్రామస్తుల పోలింగ్ బహిష్కరణ!

సత్య వెలుగు న్యూస్ – తిరుపతి జిల్లా

తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం కమ్మవారిపాలెం గ్రామస్తులు తమ గ్రామ సమస్యలు పరిష్కరించలేదంటూ ఎన్నికల పోలింగ్‌ను బహిష్కరించారు. గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం కల్పించకపోవడంతో నిరసనగా ఓటు వేయడానికి నిరాకరించారు.

పెరికిలంపాటి కండ్రిగ పోలింగ్ బూత్‌లో కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన సుమారు 200 ఓట్లు ఉన్నాయి. అయితే తమ గ్రామ అభివృద్ధి విషయంలో ప్రధాన రాజకీయ పార్టీలు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ నాయకులు పంపిన వాహనాల్లో కూడా గ్రామస్తులు ఎక్కకుండా తమ నిరసనను వ్యక్తం చేశారు

గతంలో 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదంటూ గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఎన్నికల్లో పాల్గొన్నారు.
ప్రస్తుతం గ్రామానికి తారు రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా మెటల్ పరిచే పనులు చేపట్టి, రోడ్డు నిర్మాణ ప్రక్రియ కొనసాగుతోంది. అయినప్పటికీ తమ సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం లభించే వరకు ఎన్నికల్లో పాల్గొనబోమని గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కొరత ప్రజాస్వామ్య ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతోందో ఈ ఘటన మరోసారి చర్చనీయాంశంగా మారింది.