-24 పంచాయతీల పరిధిలో జెడ్పీటీసీ ఎన్నికలు..
-పుల్లూరు, పాల్చూరులో ఎంపీటీసీ పోలింగ్
పెళ్లకూరు, సత్య వెలుగు న్యూస్: పెళ్లకూరు మండలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. మండలంలోని 24 పంచాయతీల పరిధిలోని 34 గ్రామాల్లో జెడ్పీటీసీ ఎన్నికలు జరగనుండగా, పుల్లూరు, పాల్చూరు గ్రామాల్లో రెండు ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణ కోసం 31,472 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్‌కు ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అన్ని పోలింగ్ ప్రాంతాల్లో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా
రాష్ట్రవ్యాప్తంగా 1,841 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, 2,645 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. ఆయా కేంద్రాల వద్ద అదనపు పోలీసు బలగాలను మోహరించనున్నారు. ఎన్నికల ప్రక్రియను సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా పర్యవేక్షించనున్నారు. ఎలాంటి అల్లర్లు, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
ఈ నెల 7న ఓట్ల లెక్కింపు
పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను భద్రపరిచి, ఈ నెల 7వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.