sathyavelugu.com
Date of Publish : 13 November 2026, 5:31 pm Posted by : Dr. S.sudhakar

RTI దరఖాస్తుకు 50 రోజులు గడిచినా స్పందించని అధికారులు!

–పరమేశ్వరమంగళంలో చెరువు/గుంట పూడ్చి అక్రమ నిర్మాణం..

–పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంపై ఆగ్రహం!

పుత్తూరు, నవంబర్13 , సత్య వెలుగు న్యూస్ :

పరమేశ్వరమంగళం: రెవెన్యూ పరిధిలోని ఒక గుంటను పూడ్చి అక్రమ నిర్మాణం చేపట్టిన వ్యవహారంపై సమాచార హక్కు చట్టం (RTI) కింద దరఖాస్తు చేసినప్పటికీ అధికారులు స్పందించకపోవడంపై పుత్తూరు సమాచార హక్కుల వేదిక ప్రతినిధి మురుగా రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ అక్రమ నిర్మాణానికి సంబంధించిన వివరాలు కోరుతూ గత సెప్టెంబర్ నెలలో పరమేశ్వరమంగళం పంచాయతీ కార్యదర్శికి RTI దరఖాస్తు పంపినట్లు తెలిపారు. చట్ట ప్రకారం 30 రోజుల్లో సమాచారం అందించాల్సి ఉన్నప్పటికీ, దరఖాస్తు చేసి 50 రోజులు దాటినా ఇప్పటివరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. ఫోన్ ద్వారా సంప్రదించినప్పటికీ కార్యదర్శి నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు.

పంచాయతీ కార్యదర్శి విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని MPDO కార్యాలయ అధికారులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సమాచార హక్కు చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులే చట్టాన్ని పట్టించుకోకపోతే సామాన్య ప్రజలకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.

జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలి!

తిరుపతి జిల్లా కలెక్టర్ వెంటనే ఈ వ్యవహారంపై స్పందించి, పరమేశ్వరమంగళం పంచాయతీ కార్యదర్శితో పాటు MPDO కార్యాలయంలో బాధ్యులైన అధికారుల నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని మురుగా రెడ్డి సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు.

మూడు రోజుల గడువు.. లేదంటే నల్ల బ్యానర్లతో నిరసన!

RTI దరఖాస్తు చేసి 50 రోజులు దాటిన నేపథ్యంలో అధికారులకు మరో మూడు రోజుల గడువు ఇస్తున్నామని మురుగా రెడ్డి హెచ్చరించారు. ఈ గడువులోగా కోరిన సమాచారాన్ని పూర్తిస్థాయిలో అందించకపోతే, పుత్తూరు సమాచార హక్కుల వేదిక ఆధ్వర్యంలో నల్ల బ్యానర్లు పట్టుకుని MPDO కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపడతామని స్పష్టం చేశారు.

ప్రజలకు సంబంధించిన ప్రభుత్వ భూములు, నీటి వనరుల పరిరక్షణతో పాటు సమాచార హక్కు చట్టం అమలుపై అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు.