sathyavelugu.com
Date of Publish : 11 November 2026, 4:56 pm Posted by : Dr.K.Suresh Editor

ఎన్నికల వేళ శాంతిభద్రతలపై పోలీసుల ప్రత్యేక నిఘా

-నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు – నాయుడుపేట సీఐ టి. వెంకటరమణ

నాయుడుపేట, నవంబర్ 11,సత్య వెలుగు న్యూస్: రానున్న సర్పంచ్, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నాయుడుపేట పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు నిరంతరం నిఘా ఏర్పాటు చేసినట్లు నాయుడుపేట సీఐ టి. వెంకటరమణ తెలిపారు. ఎన్నికల సమయంలో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

పట్టణంలో 30 పోలీస్ యాక్ట్ అమలు

ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నాయుడుపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని వెల్లడించారు. సర్పంచ్ ఎన్నికలు జరిగే గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళితో పాటు సెక్షన్ 144 అమల్లో ఉంటుందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు సంబంధిత నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

అనుమతి లేకుండా ర్యాలీలు, సమావేశాలు నిర్వహించరాదు

పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, బహిరంగ సమావేశాలు నిర్వహించకూడదని సీఐ స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో సెక్షన్ 144 కేవలం పోలింగ్ కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధికే పరిమితం కాదని, సంబంధిత గ్రామీణ ప్రాంతాల్లోనూ నిబంధనలు అమల్లో ఉంటాయని వివరించారు. నిబంధనలను అతిక్రమించి ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రౌడీషీటర్లపై ముందస్తు చర్యలు

ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా సమస్యాత్మక వ్యక్తులపై నిఘా ఏర్పాటు చేయడంతో పాటు రౌడీషీటర్లపై బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. గుంపులుగా తిరగడం, గొడవలకు దిగడం, ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం, ఎన్నికల ప్రశాంతతకు భంగం కలిగించే చర్యలను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు.

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలి

ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు, ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని గౌరవించాలని సీఐ టి. వెంకటరమణ కోరారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పోలీసులకు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.