sathyavelugu.com
Date of Publish : 11 November 2026, 4:04 pm Posted by : Dr.K.Suresh Editor

దివ్యాంగ ఉద్యోగులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచన

విజయవాడ, నవంబర్ 11 ,సత్య వెలుగు న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల విధుల నిర్వహణకు సంబంధించి దివ్యాంగ ఉద్యోగులు, ఓటర్లకు అనుకూలమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి డా. ఏ. మల్లికార్జున, ఐఏఎస్, Rc.No.863/SEC-F1/2026 ద్వారా జారీ చేసిన లేఖలో దివ్యాంగ ఉద్యోగులకు వీలైనంత వరకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు కల్పించాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు సూచించారు. అదేవిధంగా దివ్యాంగ ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపులు, ఇతర అవసరమైన ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. Visually Challenged Employees Association సమర్పించిన వినతిపత్రాన్ని పరిశీలించిన అనంతరం ఈ సూచనలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో దివ్యాంగుల భాగస్వామ్యాన్ని సులభతరం చేసేందుకు ఈ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.