–వ్యర్థాల నిర్వహణ షెడ్డును పరిశీలించిన అధికారులు
-గ్రీన్ అంబాసిడర్లకు చెత్త విభజనపై శిక్షణ
చౌడేపల్లి, సెప్టెంబర్ 29, సత్య వెలుగు న్యూస్:
చౌడేపల్లి మండలంలోని దిగుపల్లి గ్రామపంచాయతీ పరిధిలో వ్యర్థాల నిర్వహణ షెడ్డును మంగళవారం డిప్యూటీ ఎంపీడీవో ఎస్.సి. గఫూర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా వ్యర్థాల నిర్వహణ షెడ్డులో కొనసాగుతున్న కార్యకలాపాలను పరిశీలించిన ఆయన, గ్రామ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు షెడ్డును మరింత అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. వ్యర్థాల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా వేగవంతమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
గ్రీన్ అంబాసిడర్లకు ప్రత్యేక శిక్షణ
అనంతరం చెత్త వేరు చేసే సెగ్రిగేషన్ ప్రక్రియపై గ్రామపంచాయతీ కార్యదర్శి గోపి గ్రీన్ అంబాసిడర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం, వాటిని శాస్త్రీయ పద్ధతిలో వివిధ రకాలుగా విభజించడం, వ్యర్థాల నిర్వహణలో పాటించాల్సిన విధానాలపై గ్రీన్ అంబాసిడర్లకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో దిగుపల్లి గ్రామపంచాయతీకి చెందిన గ్రీన్ అంబాసిడర్లు పాల్గొన్నారు. గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం కృషి చేస్తామని వారు తెలిపారు.

