-ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల రాజకీయ మార్పు కోసం బందిలి భాగ్యమ్మ పిలుపు!
-ఏకోలు ఎంపీటీసీగా బీఎస్పీ తరఫున పోటీ చేసి ప్రజల మద్దతు పొందిన బందిలి భాగ్యమ్మ
,సత్య వెలుగు న్యూస్ నవంబర్ 8సూళ్లూరుపేట : ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల్లో రాజకీయ చైతన్యం తీసుకురావడం, ఆయా వర్గాల ప్రజలు రాజ్యాధికారాన్ని చేపట్టే స్థాయికి ఎదగాలన్నదే తన రాజకీయ ప్రయాణ ప్రధాన లక్ష్యమని ఏకోలు ఎంపీటీసీగా బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) తరఫున పోటీ చేసిన బందిలి భాగ్యమ్మ స్పష్టం చేశారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ, మాన్యశ్రీ కాన్షీరామ్ ఆలోచనా విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నానని ఆమె తెలిపారు. అణగారిన వర్గాలకు కేవలం ఓటు హక్కు మాత్రమే కాకుండా, పాలించే అధికారం కూడా దక్కాలన్నదే తన ఆకాంక్ష అని పేర్కొన్నారు.
దొరవారిసత్రం మండలంలోని ఏకోలు ఎంపీటీసీ సెగ్మెంట్ నుంచి బీఎస్పీ తరఫున ఎన్నికల బరిలో నిలవడానికి ప్రధాన కారణం రాజకీయంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల్లో చైతన్యం తీసుకురావడమేనని భాగ్యమ్మ వెల్లడించారు. బహుజన ఉద్యమంతో అనుబంధం కలిగిన తన భర్త బందిలి శంకరయ్య ప్రోత్సాహం, మద్దతుతో ఎన్నికల్లో పోటీ చేసినట్లు తెలిపారు.
ఈ ఎన్నికల ద్వారా బీఎస్పీ ఎన్నికల గుర్తు ఏనుగును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు, అంబేద్కర్, కాన్షీరామ్ వంటి మహనీయుల ఆశయాలను ప్రజలకు వివరించే అవకాశం లభించిందన్నారు. ఎన్నికల్లో గెలుపోటముల కంటే అణగారిన వర్గాల్లో రాజకీయ అవగాహన పెంపొందించడం, వారు తమ హక్కుల కోసం ప్రశ్నించే స్థాయికి ఎదగడం తనకు ముఖ్యమని పేర్కొన్నారు.
ఈ ఎన్నికల్లో తనకు సహకరించిన బహుజన సమాజ్ పార్టీ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ కార్యవర్గానికి, తిరుపతి జిల్లా అధ్యక్షుడికి, జిల్లా కార్యవర్గ సభ్యులకు, సూళ్లూరుపేట నియోజకవర్గ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే ఏకోలు ఎంపీటీసీ సెగ్మెంట్ పరిధిలో తనకు మద్దతుగా నిలిచిన ఓటర్లు, యువత, మహిళలు, ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
రాజకీయ అధికారం కొందరి చేతుల్లోనే పరిమితం కాకూడదు… అణగారిన వర్గాల చేతుల్లోకి కూడా రావాలి. ప్రతి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కుటుంబంలో రాజకీయ చైతన్యం రావాలి. మన హక్కులను మనమే సాధించుకోవాలి. రాజ్యాధికారంలో మనకూ భాగస్వామ్యం ఉండాలన్నదే నా జీవిత ఆశయం. అంబేద్కర్ చూపిన మార్గంలో, కాన్షీరామ్ చూపిన రాజకీయ పోరాట స్ఫూర్తితో నా ప్రయాణం కొనసాగిస్తాను అని బందిలి భాగ్యమ్మ స్పష్టం చేశారు.
చివరిగా తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై భీమ్! జై కాన్షీరామ్! అని ఆమె పేర్కొన్నారు.




