సుప్రీంకోర్టు హెచ్చరిక: కనిపించకుండా పోయిన ప్రతి వ్యక్తిపై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి
న్యూఢిల్లీ: ఎవరైనా వ్యక్తి కనిపించకుండా పోయినట్లు సమాచారం అందిన వెంటనే వయస్సు, లింగ భేదం లేకుండా తప్పనిసరిగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది.
జస్టిస్ అహ్సానుద్దీన్ అమనుల్లా, జస్టిస్ ఆర్. మహదేవన్‌ల ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేస్తూ, గత ఉత్తర్వుల్లోని “వ్యక్తి” అనే పదం పిల్లలకే కాకుండా పెద్దలకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది.
ప్రాథమిక విచారణ పేరుతో ఆలస్యం చేయకుండా, బాధిత కుటుంబ సభ్యులపై వెతకాల్సిన బాధ్యత మోపకుండా పోలీసులు వెంటనే చర్యలు ప్రారంభించాలని కోర్టు పేర్కొంది. కనిపించకుండా పోయిన తొలి గంటలనే “గోల్డెన్ అవర్స్”గా అభివర్ణిస్తూ, ఆ సమయంలో చర్యలు తీసుకుంటే ఆచూకీ లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపింది.
ఈ ఆదేశాలను అమలు చేయని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, అక్టోబర్ 5న జరిగే తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.


