-రూ.108 కోట్లతో నూతన ప్లాంట్ ఏర్పాటు
-200 మందికి అదనపు ఉద్యోగ అవకాశాలు
సత్య వెలుగు న్యూస్, సూళ్లూరుపేట : శ్రీసిటీలో పారిశ్రామిక అభివృద్ధికి మరో ముందడుగు పడింది. జపాన్‌కు చెందిన ప్రముఖ స్టీల్ ప్లేట్ల ప్రాసెసింగ్ సంస్థ ఇండియా మెటల్ వన్ స్టీల్ ప్లేట్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (IMOP) తన రెండో తయారీ కేంద్రాన్ని బుధవారం ఘనంగా ప్రారంభించింది. ఈ నూతన ప్లాంట్ ఏర్పాటుతో శ్రీసిటీలో సంస్థ తన కార్యకలాపాలను మరింత విస్తరించింది.
2012 ఆగస్టులో శ్రీసిటీలో కార్యకలాపాలు ప్రారంభించిన ఐఎంఓపీ సంస్థ 2019లో పరిశ్రమ విస్తరణ చేపట్టింది. తాజాగా మరో నూతన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇందుకోసం సంస్థ రూ.108 కోట్ల పెట్టుబడి పెట్టింది. దీంతో శ్రీసిటీలో సంస్థ మొత్తం పెట్టుబడులు రూ.408 కోట్లకు చేరుకున్నాయి. సుమారు 12 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ప్లాంట్‌ను నిర్మించారు.
ఈ నూతన ప్లాంట్ అందుబాటులోకి రావడంతో సంస్థ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 48 వేల మెట్రిక్ టన్నుల నుంచి 60 వేల మెట్రిక్ టన్నులకు పెరగనుంది. తద్వారా ఉత్పత్తి సామర్థ్యంలో 25 శాతం వృద్ధి సాధించనుంది. ఈ విస్తరణ ద్వారా అదనంగా 200 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. దీంతో సంస్థలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 850కి చేరనుంది.
ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తైజో ఇవామి మాట్లాడుతూ తమ సంస్థకు నిరంతరం సహకారం అందిస్తున్న వినియోగదారులు, వ్యాపార భాగస్వాములు, ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. నూతన ప్లాంట్ ద్వారా మరింత నాణ్యమైన ఉత్పత్తులను అందించడంతో పాటు భద్రతా ప్రమాణాలు, సేవలను మరింత మెరుగుపరచనున్నట్లు వెల్లడించారు.
ఐఎంఓపీ యాజమాన్యానికి అభినందనలు తెలిపిన శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ సంస్థ వరుసగా చేపడుతున్న విస్తరణలు శ్రీసిటీపై అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ పెట్టుబడులు స్థానికంగా ఉద్యోగ అవకాశాలను పెంచడంతో పాటు ప్రాంతీయ పారిశ్రామిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. సమీప ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంస్థ సీఎస్ఆర్ నిధుల ద్వారా అందిస్తున్న సహకారాన్ని ప్రత్యేకంగా అభినందించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మెటల్ వన్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ సీఓఓ మసాషి మిజునో, మెటల్ వన్ ఇండియా ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ యుకితా సాటో, సోజిట్జ్ కార్పొరేషన్ ఇండియా ప్రతినిధులు, వినియోగదారు మరియు సరఫరాదారు సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అనంతరం సంస్థ అభివృద్ధికి దీర్ఘకాలంగా సహకరిస్తున్న వ్యాపార భాగస్వాములకు తైజో ఇవామి ప్రశంసా పురస్కారాలను అందజేశారు. పురస్కారాలు అందుకున్న సంస్థల్లో శ్రీసిటీలోని క్యాటర్‌పిల్లర్, కోబెల్కోతో పాటు టాటా హిటాచీ, డూసన్ బాబ్‌క్యాట్ సంస్థలు ఉన్నాయి. అలాగే ప్రధాన ఉక్కు సరఫరాదారులైన టాటా స్టీల్, జిందాల్ స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ సంస్థలను కూడా గుర్తించి సత్కరించారు.
శ్రీసిటీలో అంతర్జాతీయ స్థాయి సంస్థలు వరుసగా పెట్టుబడులు పెట్టి తమ కార్యకలాపాలను విస్తరిస్తుండటం ఈ ప్రాంత పారిశ్రామిక ప్రగతికి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు ఆశాజనక పరిణామంగా నిలుస్తోంది.




