సత్య వెలుగు న్యూస్, నవంబర్ 12: సూళ్లూరుపేట RC ప్రతినిధి:
తాడేపల్లి: నాయుడుపేట మున్సిపాలిటీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మాజీ ఏఎంసీ చైర్మన్ తంబిరెడ్డి జనార్దన్ రెడ్డి, ఆయన సతీమణి, నాయుడుపేట మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన తంబిరెడ్డి రాజేశ్వరమ్మ, వారి కుమారుడు, టీఎంఆర్ గ్రూప్ అధినేత తంబిరెడ్డి మోహన్ రెడ్డి, కుమార్తెతో కలిసి వైఎస్ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా రాజేశ్వరమ్మ పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. నాయుడుపేట మున్సిపాలిటీలో పార్టీ సాధించిన విజయానికి సంబంధించిన పోలింగ్ బుక్‌ను జగన్‌కు అందజేశారు.
రాజేశ్వరమ్మకు జగన్ అభినందనలు
నాయుడుపేట మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన తంబిరెడ్డి రాజేశ్వరమ్మను వైఎస్ జగన్ ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
సూళ్లూరుపేట రాజకీయ పరిస్థితులపై చర్చ
అనంతరం డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి, కిలివేటి సంజీవయ్యలతో వైఎస్ జగన్ ప్రత్యేకంగా మాట్లాడారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతానికి చేపడుతున్న కార్యక్రమాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కిలివేటి సంజీవయ్య తనపై గత కొంతకాలంగా చోటుచేసుకుంటున్న పోలీసుల వేధింపులు, ముందస్తు నోటీసులు, హౌస్ అరెస్టులు, రాజకీయపరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను జగన్ దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న పరిస్థితులు, భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: వైఎస్ జగన్
నాయుడుపేట మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీ సాధించిన ఘన విజయం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తి, ఐక్యత, పట్టుదలతో రానున్న ఎన్నికల్లోనూ ముందుండి పనిచేయాలని కిలివేటి సంజీవయ్యకు సూచించారు.
ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై పోరాడాలని, నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ సూళ్లూరుపేట నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు.
నాయుడుపేట మున్సిపాలిటీలో సాధించిన విజయం రానున్న రోజుల్లో పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తుందని, ప్రజల పక్షాన నిలబడి రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.




