-నాయుడుపేట మండలంలో ప్రతిపాదిత పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల
సత్య వెలుగు న్యూస్ , నవంబర్ 12 , నాయుడుపేట: రానున్న గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలు–2026 నిర్వహణకు సంబంధించి నాయుడుపేట మండలంలో అధికార యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మండల పరిధిలోని గ్రామ పంచాయతీల వారీగా ప్రతిపాదిత పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను ఎంపీడీవో రాజేంద్ర బాలాజీ విడుదల చేశారు.
ఈ ముసాయిదా జాబితాలో గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల సంఖ్య, ప్రతిపాదిత పోలింగ్ కేంద్రాలు, కేంద్రాల నిర్వహణకు ఎంపిక చేసిన భవనాలు, ఒక్కో పోలింగ్ కేంద్రానికి కేటాయించనున్న ఓటర్ల సంఖ్య తదితర వివరాలను పొందుపరిచారు.
మండల పరిధిలోని అన్నమేడు, అరవపెరిమిడి, భీమవరం, చిగురుపాడు, చిలమత్తూరు, ద్వారకాపురం, గొట్టిప్రోలు, జువ్వలపాళెం, కల్లిపేడు, కాపులూరు, కూచివాడ, మర్లపల్లి, మేముగుంటపాలెం, మేనకూరు, పండ్లూరు, పూడేరు, పుదూరు, తిమ్మాజికండ్రిగ, విన్నమాల తదితర గ్రామ పంచాయతీలకు సంబంధించిన వివరాలను ఈ జాబితాలో వెల్లడించారు.
ఎన్నికల మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించినట్లు అధికారులు తెలిపారు. ఓటర్లు తమ ఓటు హక్కును సులభంగా వినియోగించుకునేలా, ఎన్నికల సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అనువైన ప్రదేశాల్లో పోలింగ్ కేంద్రాల ఎంపికకు ప్రాధాన్యత ఇచ్చారు.
విడుదల చేసిన ముసాయిదా జాబితాపై సంబంధిత వర్గాలు పరిశీలన జరిపి, అవసరమైన అభ్యంతరాలు లేదా సూచనలు అందిస్తే వాటి ఆధారంగా తగిన మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉంది.
గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని విధాలా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు ఎంపీడీవో రాజేంద్ర బాలాజీ వెల్లడించారు.




