న్యూఢిల్లీ: తిరుపతిలో ఇప్పటికే పనిచేస్తున్న నైలెట్ (NIELIT) తాత్కాలిక క్యాంపస్ స్థానంలో ఏర్పాటు చేయాల్సిన పర్మనెంట్ క్యాంపస్‌ను మంగళగిరికి తరలించే నిర్ణయాన్ని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తీవ్రంగా వ్యతిరేకించారు. తిరుపతిలో బలమైన విద్యా, పారిశ్రామిక ఎకోసిస్టమ్ ఉన్నందున నైలెట్ పర్మనెంట్ క్యాంపస్‌ను ఇక్కడే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
2022లో ఎస్వీ యూనివర్సిటీలో నైలెట్ తాత్కాలిక క్యాంపస్ ప్రారంభమైందని, ప్రస్తుతం 1,200 మందికి పైగా విద్యార్థులు వివిధ కోర్సుల్లో శిక్షణ పొందుతున్నారని తెలిపారు. పర్మనెంట్ క్యాంపస్ కోసం రూ.180 కోట్ల డీపీఆర్ సిద్ధం కాగా, ఫేజ్-1 కింద రూ.80 కోట్లు కేటాయించేందుకు కేంద్రం అంగీకరించిందన్నారు.
ఇప్పటికే తిరుపతిలో ఏర్పాటైన సంస్థను మంగళగిరికి తరలించడం సమంజసం కాదని ఎంపీ పేర్కొన్నారు. నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే పునఃపరిశీలించాలని కోరుతూ, ఈ అంశాన్ని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పార్లమెంట్‌లోనూ ప్రస్తావిస్తామని తెలిపారు. నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే విద్యార్థులు, నిరుద్యోగ యువతతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.


