గుంటూరు, సెప్టెంబర్ 30 ,సత్య వెలుగు న్యూస్
గుంటూరు జిల్లా ప్రజలకు మరింత సురక్షితమైన వాతావరణం కల్పించడంతో పాటు నేరాలను సమర్థవంతంగా నియంత్రించేందుకు ‘ఆపరేషన్ త్రిశూల్’ పేరుతో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ తెలిపారు.
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్తో కలిసి కలెక్టరేట్‌లో నిర్వహించిన తొలి సమీక్ష సమావేశంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో శాంతిభద్రతలను బలోపేతం చేయడంతో పాటు నేరాల నివారణకు వివిధ శాఖలు సమన్వయంతో కార్యాచరణ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
డ్రగ్స్‌పై ప్రత్యేక నిఘా
మాదకద్రవ్యాల సరఫరా, వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. డ్రగ్స్ హాట్‌స్పాట్లను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పాఠశాలలు, కళాశాలల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థల యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మత్తు విముక్తి కేంద్రాన్ని మరింత బలోపేతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
మహిళల భద్రతకు ప్రాధాన్యం
మహిళలపై నేరాల నివారణకు శక్తి బృందాల కార్యకలాపాలను మరింత బలోపేతం చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రజా ప్రదేశాలు, విద్యాసంస్థలు, రవాణా కేంద్రాల వద్ద పర్యవేక్షణ పెంచి మహిళలకు సురక్షిత వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు.
రోడ్డు ప్రమాదాల నివారణ
రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లాలో గుర్తించిన ప్రమాదకర ప్రాంతాల్లో నెల రోజుల్లో భద్రతా చర్యలు పూర్తి చేయాలని ఆదేశించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో వాహనాల వేగ నియంత్రణకు ప్రత్యేక పరికరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళల భద్రత, రోడ్డు భద్రతలో ప్రజల భాగస్వామ్యం కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు భద్రతా చర్యలకు సహకరించాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ రమణమూర్తి, జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి, ఆర్టీవో శ్రీహరి రావు తదితర అధికారులు పాల్గొన్నారు.

