-నందిమంగళానికి దారి కరువు
-హైవే నిర్మాణంతో గ్రామస్తుల అవస్థలు
-అండర్‌పాస్ లేదా యూ-టర్న్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి
పుత్తూరు,సత్యవెలుగు న్యూస్, సెప్టెంబర్ 20: తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణ పరిధిలో జరుగుతున్న హైవే రోడ్డు నిర్మాణంతో నందిమంగళం గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోతున్నారు. గ్రామానికి రాకపోకలు సాగించేందుకు సరైన మార్గం లేకపోవడంతో పాటు పలు వైపులా డివైడర్లు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు దూరప్రాంతాల మీదుగా వెళ్లాల్సి వస్తోందని తెలిపారు.
హైవే నిర్మాణం కారణంగా అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లే రోగులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, విధులకు హాజరయ్యే ఉద్యోగులు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అవసరమైన ప్రాంతాలకు చేరుకోవడానికి డైవర్షన్ మార్గంలో సుదూరంగా ప్రయాణించాల్సి వస్తోందని, దీంతో సమయం వృథా కావడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సంబంధిత హైవే అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించాలని కోరుతున్నారు. నందిమంగళం గ్రామానికి సులభంగా రాకపోకలు సాగించేలా అండర్‌పాస్, సరైన క్రాసింగ్ లేదా అవసరమైన ప్రాంతంలో యూ-టర్న్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రజల భద్రత, అత్యవసర రాకపోకలు మరియు విద్యార్థుల ప్రయాణాన్ని పరిగణనలోకి తీసుకుని అధికారులు స్థలాన్ని పరిశీలించి తగిన పరిష్కారం చూపాలని స్థానికులు మీడియా ద్వారా కోరుతున్నారు.


