-నామినేషన్ల ప్రక్రియను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం
-దాడికి పాల్పడిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి: వెంకటగిరి కన్వీనర్ ఎం.బి. రాజు
వెంకటగిరి, అక్టోబర్ 18, సత్య వెలుగు న్యూస్:తిరుపతి బైరాగిపట్టేడలోని రామానాయుడు స్కూల్‌లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రం వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థుల నామినేషన్లను అధికార పార్టీ నాయకులు అడ్డుకుని, బెదిరింపులకు పాల్పడ్డారని ఆ పార్టీ వెంకటగిరి కన్వీనర్ ఎం.బి. రాజు ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ మేయర్ అభ్యర్థి నీరుగట్టు నగేష్‌పై కూడా దౌర్జన్యం చేసి, నామినేషన్ ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆయన పేర్కొన్నారు.
ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన ఎం.బి. రాజు.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష అభ్యర్థుల నామినేషన్లకు ఆటంకాలు కలిగించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటిదని విమర్శించారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కల్పించాలని అన్నారు.
ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి, దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఎం.బి. రాజు డిమాండ్ చేశారు.

