-ఏడిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యరబోతు సుబ్రహ్మణ్యం ప్రకటన
సత్య వెలుగు న్యూస్ | అక్టోబర్ 30 | సూళ్లూరుపేట:రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థులకు అంబేద్కర్ ధర్మ పోరాట సమితి (ఏడిపిఎస్) నాయకులు, కార్యకర్తలు మద్దతుగా నిలవాలని ఏడిపిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు యరబోతు సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బహుజనుల ఆత్మగౌరవం, రాజకీయ స్వాభిమానం, రాజ్యాధికార సాధనే లక్ష్యంగా బహుజన సమాజం రాజకీయంగా చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు తమ ఓటు విలువను గుర్తించి రాజకీయ చైతన్యంతో వ్యవహరించాలని పేర్కొన్నారు.
బీఎస్పీ ఏనుగు గుర్తుకు మద్దతు తెలపడం ద్వారా బహుజన సమాజం రాజకీయ ప్రాతినిధ్యాన్ని సాధించే దిశగా ముందడుగు వేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. కేవలం ఓటర్లుగా మిగిలిపోకుండా పాలనా వ్యవస్థలో భాగస్వాములు కావాలనే లక్ష్యంతో బహుజనులు ఐక్యంగా ముందుకు సాగాలని అన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏడిపిఎస్ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు బీఎస్పీ అభ్యర్థులకు మద్దతుగా నిలిచి, వారి ఎన్నికల ప్రచారానికి సహకరించాలని కోరారు. బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, మాన్యశ్రీ కాన్షీరామ్ ఆశయాలను గౌరవించే ప్రతి ఒక్కరూ బహుజన రాజకీయ చైతన్యానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అదేవిధంగా రాష్ట్రంలోని అంబేద్కరిస్టులు, అంబేద్కర్ సంఘాల నాయకులు, ప్రముఖ గాయకులు తమ కార్యకర్తలు, కుటుంబ సభ్యులకు ఈ రాజకీయ మద్దతు నిర్ణయాన్ని తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. అంబేద్కర్ భావజాలాన్ని మాటల్లోనే కాకుండా ఆచరణలోనూ ప్రతిబింబించాలని పేర్కొన్నారు.
బాబాసాహెబ్ అంబేద్కర్, మాన్యశ్రీ కాన్షీరామ్ ఆశయాల సాధనకు బహుజనుల రాజకీయ ఐక్యత, స్వీయ ప్రాతినిధ్యం కీలకమని యరబోతు సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు.

