-అనంతపురం జిల్లాలో 2,500 కోళ్లు మృతి.. 10 కి.మీ పరిధిలో నిఘా
అనంతపురం, అక్టోబర్ 7, సత్య వెలుగు న్యూస్ :
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో బర్డ్‌ఫ్లూ (ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా) నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురం గ్రామంలోని ఓ పౌల్ట్రీ ఫామ్‌లో సుమారు 2,500 నాటుకోళ్లు మృతి చెందాయి. కోళ్ల నమూనాలను భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (NIHSAD)కు పంపించగా బర్డ్‌ఫ్లూ వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.
సిద్ధరాంపురానికి చెందిన రైతు నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ కింద పౌల్ట్రీ ఫామ్ ఏర్పాటు చేయగా, ఇటీవల తెలంగాణలోని ఆదిలాబాద్ నుంచి కోళ్లను తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఆ కోళ్లలో కొన్ని అనారోగ్యానికి గురై మృతి చెందడంతో నమూనాలను పరీక్షలకు పంపించారు.
10 కి.మీ పరిధిలో నిఘా
బర్డ్‌ఫ్లూ వ్యాప్తిని అరికట్టేందుకు ఫామ్ చుట్టూ 1 కిలోమీటర్ పరిధిని ఇన్ఫెక్టెడ్ జోన్‌గా, 10 కిలోమీటర్ల పరిధిని అలర్ట్ జోన్‌గా అధికారులు ప్రకటించారు. కోళ్లు, గుడ్లు, పౌల్ట్రీ ఉత్పత్తుల రాకపోకలను నియంత్రించేందుకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేపట్టారు.
అధికారుల సూచనల మేరకు ప్రభావిత ప్రాంతంలో చనిపోయిన, అనుమానిత పక్షులను నిబంధనల ప్రకారం నిర్వీర్యం చేస్తున్నారు. పౌల్ట్రీ ఉత్పత్తుల నిర్వహణలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
ప్రజలకు జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు.

