📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeస్పోర్ట్స్క్రికెట్‌లో కొత్త ఫార్మాట్‌.. అమ్మాయిలు, అబ్బాయిలు కలిపి ఆడేలా!

క్రికెట్‌లో కొత్త ఫార్మాట్‌.. అమ్మాయిలు, అబ్బాయిలు కలిపి ఆడేలా!

📰 Generate e-Paper Clip

ముంబై, అక్టోబరు 16 ,సత్య వెలుగు న్యూస్: క్రికెట్‌లో మరో వినూత్న ఫార్మాట్‌ అందుబాటులోకి రానుంది. మహిళలు, పురుషులు వేర్వేరుగా మ్యాచ్‌లు ఆడినా.. రెండు జట్ల స్కోర్లను కలిపి విజేతను నిర్ణయించేలా ‘టెస్ట్‌ ట్వంటీ’ పేరుతో కొత్త విధానాన్ని తీసుకొస్తున్నారు. క్రికెట్‌లో నాలుగో ఫార్మాట్‌గా నిర్వాహకులు అభివర్ణిస్తున్న ఈ టోర్నీ తొలి సంచిక నవంబరు 14 నుంచి 29 వరకు శ్రీలంక రాజధాని కొలంబోలో జరగనుంది. సింహాలీస్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ మైదానం ఈ పోటీలకు వేదిక కానుంది.
ఒక్కో జట్టులో 40 మంది ఆటగాళ్లు
ఈ టోర్నీలో ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన 13 నుంచి 21 ఏళ్ల వయసున్న 160 మంది క్రికెటర్లు పాల్గొననున్నారు. వారిని నాలుగు జట్లుగా విభజిస్తారు. ఒక్కో జట్టులో 20 మంది మహిళలు, 20 మంది పురుషులు ఉంటారు. మహిళల జట్టు ప్రత్యర్థి మహిళల జట్టుతో, పురుషుల జట్టు ప్రత్యర్థి పురుషుల జట్టుతో తలపడుతుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో సాధించిన పరుగులను కలిపి జట్టు మొత్తం స్కోరుగా పరిగణిస్తారు. ఆ ఉమ్మడి స్కోరు ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు.
ఈ విధానంలో మహిళలు, పురుషుల ప్రదర్శనకు సమాన ప్రాధాన్యం లభించనుంది. ఒక విభాగంలో సాధించిన ఆధిక్యం మరో విభాగంలో వచ్చిన ఫలితంతో కలిసి తుది విజయాన్ని నిర్ణయిస్తుంది.
టాస్‌ నుంచే ప్రత్యేక నిబంధనలు
టెస్ట్‌ ట్వంటీ ఫార్మాట్‌లో టాస్‌ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్‌ చేయాలా? బౌలింగ్‌ చేయాలా? అనే నిర్ణయంతో పాటు మహిళల మ్యాచ్‌ ముందుగా జరగాలా, పురుషుల మ్యాచ్‌ ముందుగా జరగాలా? అనేది కూడా ఎంచుకోవచ్చు. ఈ విధానాన్ని ‘పారిటీ రూల్‌’గా పేర్కొంటున్నారు.
ఒక్కో మ్యాచ్‌ రోజులో మొత్తం 80 ఓవర్లు ఉంటాయి. తొలి 40 ఓవర్లను పగటి సమయంలో ఎర్ర బంతితో, తెల్ల దుస్తుల్లో ఆడతారు. మిగిలిన 40 ఓవర్లను ఫ్లడ్‌లైట్ల వెలుగులో తెల్ల బంతితో, రంగుల దుస్తుల్లో నిర్వహిస్తారు. రెండు సెషన్లలో సాధించిన పరుగులను కలిపి తుది ఫలితాన్ని ప్రకటిస్తారు.
దిగ్గజాల సలహాలు.. యువతకు వేదిక
ఈ వినూత్న ఫార్మాట్‌కు మాజీ క్రికెటర్లు ఏబీ డివిలియర్స్‌, మాథ్యూ హేడెన్‌, సర్‌ క్లైవ్‌ లాయిడ్‌ సలహా మండలి సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. రాజ్‌కుమార్‌ శర్మ నేతృత్వంలోని ఎంపిక కమిటీతో పాటు మైక్‌ ఫోర్డ్‌హామ్‌ ఆధ్వర్యంలో టోర్నీ నిర్వహణ కొనసాగనుంది.
టెస్ట్‌ ట్వంటీ వ్యవస్థాపకుడు గౌరవ్‌ బహిర్వానీ తెలిపిన వివరాల ప్రకారం.. యువ క్రికెటర్లకు ప్రత్యేక వేదిక కల్పించడం, మహిళలు–పురుషుల ప్రతిభకు సమాన గుర్తింపు తీసుకురావడం ఈ ఫార్మాట్‌ ప్రధాన ఉద్దేశం. టోర్నీ నిర్వహణకు సహకరిస్తున్న శ్రీలంక క్రికెట్‌ బోర్డు, సింహాలీస్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ప్రయోగం విజయవంతమైతే యువ ఆటగాళ్లకు కొత్త అవకాశాలు లభించడంతో పాటు మహిళా, పురుషుల క్రికెట్‌కు సమాన ప్రాధాన్యం కల్పించే దిశగా ముందడుగు పడే అవకాశం ఉంది. అయితే ఈ విధానం మైదానంలో ఎలా పనిచేస్తుంది? అభిమానులను ఎంతవరకు ఆకట్టుకుంటుంది? అన్నది తొలి టోర్నీతో తేలనుంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!