తొట్టంబేడు,సత్య వెలుగు న్యూస్:గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా తొట్టంబేడు మండలం బసవయ్యపాలెం గ్రామంలో వర్షపు నీరు నిలిచిపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలోని రహదారులపై నీరు, బురద పేరుకుపోవడంతో ప్రజలు రాకపోకలు సాగించేందుకు అవస్థలు పడుతున్నారు.
ఈ సమస్యపై పలుమార్లు పత్రికల ద్వారా, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన కనిపించడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురిసిన ప్రతిసారీ ఇదే పరిస్థితి ఎదురవుతున్నప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదని వాపోతున్నారు.
బురద నీటిలో నడవడమే శరణ్యమా?
గ్రామంలో నీరు నిలిచిపోవడంతో ప్రజలు బురద నీటిలోనే నడుచుకుంటూ రాకపోకలు సాగించాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో వృద్ధులు, చిన్నారులు, మహిళలు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామంలో నిలిచిన వర్షపు నీటిని తొలగించి, నీటి నిల్వ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని బసవయ్యపాలెం గ్రామ ప్రజలు కోరుతున్నారు.
సత్య వెలుగు న్యూస్ | ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం




