📄 ePaper
Saturday, November 7, 2026
spot_img
📄 ePaper
Homeఎడిటోరియల్ఎన్నికల ఖర్చులపై ప్రత్యేక నిఘా.. ప్రతి రూపాయికీ లెక్క ఉండాలి

ఎన్నికల ఖర్చులపై ప్రత్యేక నిఘా.. ప్రతి రూపాయికీ లెక్క ఉండాలి

📰 Generate e-Paper Clip

నాయుడుపేట, అక్టోబర్ 28 ,సత్య వెలుగు న్యూస్:మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎన్నికల ఖర్చులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ప్రతి రూపాయికీ లెక్క ఉండేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు కె. మహబూబ్ బాషా (ఐఎఫ్ఎస్) అధికారులకు సూచించారు. ఎన్నికల వ్యయ నిర్వహణలో పారదర్శకత పాటించాలని, రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.

నాయుడుపేట పట్టణంలోని కేకే కల్యాణ మండపంలో ఎన్నికల వ్యయ పర్యవేక్షణ, సమీక్షా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోటీలో ఉన్న అభ్యర్థుల ఎన్నికల వ్యయ ఖాతాలను పరిశీలించడంతో పాటు స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు (ఎస్‌ఎస్‌టీ), ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల (ఎఫ్‌ఎస్‌టీ) పనితీరు, పురోగతిపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట డీఎస్పీ జి. చెంచుబాబు పాల్గొన్నారు.

ప్రతి ఖర్చును రిజిస్టర్‌లో నమోదు చేయాలి

ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ప్రచార ఖర్చులకు సంబంధించిన ప్రతి వివరాన్ని వ్యయ రిజిస్టర్లలో క్రమం తప్పకుండా నమోదు చేయాలని ఎన్నికల వ్యయ పరిశీలకుడు సూచించారు. రోజువారీ ఖర్చుల వివరాలను సంబంధిత అకౌంటింగ్ బృందాలకు సమర్పించాలని, ఎన్నికల వ్యయ నిర్వహణ కోసం ప్రత్యేక బ్యాంకు ఖాతాను వినియోగించాలని తెలిపారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం రూ.2 వేల కంటే తక్కువ మొత్తాలకు నగదు రూపంలో, రూ.2 వేల కంటే ఎక్కువ మొత్తాలకు బ్యాంకు బదిలీ ద్వారా చెల్లింపులు చేయాలని అభ్యర్థులకు వివరించారు.

వ్యయ పరిమితి దాటితే చర్యలు

మున్సిపల్ ఎన్నికల్లో వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులకు గరిష్ఠ ఎన్నికల వ్యయ పరిమితి రూ.7.50 లక్షలు కాగా, మున్సిపల్ చైర్‌పర్సన్ పదవికి పోటీ చేసే అభ్యర్థులకు రూ.20 లక్షలుగా నిర్ణయించినట్లు అధికారులు వివరించారు. అభ్యర్థులు నిర్దేశిత వ్యయ పరిమితులను దాటకుండా, ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఖర్చులు నిర్వహించాలని సూచించారు.

పోలింగ్‌కు ముందు, తర్వాతా నిఘా

ఎన్నికల వ్యయ పర్యవేక్షణ బృందాలు, పోలీసు అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఎన్నికల సంఘం మార్గదర్శకాల అమలుపై చర్చించారు. పోలింగ్‌కు ముందు, పోలింగ్ అనంతరం చేపట్టాల్సిన పర్యవేక్షణ చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ఖర్చుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా నోడల్ అధికారి వై. మధుకిరణ్ రెడ్డి, నాయుడుపేట డీఎస్పీ జి. చెంచుబాబు, సహాయ ఎన్నికల వ్యయ పరిశీలకుడు ఎస్‌కే అబ్దుల్ కలాం, బృంద సభ్యులు రామచంద్ర, గురునాథం, శ్రీకాంత్‌తో పాటు సంబంధిత అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!