📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతికొత్త పార్టీపై విజయసాయిరెడ్డి ప్రకటన

కొత్త పార్టీపై విజయసాయిరెడ్డి ప్రకటన

📰 Generate e-Paper Clip

– సెక్యులరిజంపై ఘాటు వ్యాఖ్యలు
– మూడో రాజకీయ శక్తిగా ఎదుగుతామని ధీమా
– ఆలయాల్లో వివక్షపై ఆగ్రహం
తిరుపతి, అక్టోబర్ 8, సత్య వెలుగు న్యూస్: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు రాజకీయ, సామాజిక అంశాలపై స్పందించారు. కొందరు ఆలయాల్లో అర్చకులు ఇచ్చే తీర్థాన్ని స్వీకరించినట్లు నటిస్తూ కిందకు వదిలేస్తారని, అదే వారు పాటించే సెక్యులరిజమని విమర్శించారు. తాను స్వచ్ఛమైన హిందువునని పేర్కొంటూనే, ఇతర మతాల ప్రార్థనా స్థలాలను కూడా సందర్శిస్తానని చెప్పారు. మతాల మధ్య పరస్పర గౌరవం అవసరమని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించారు. త్వరలో కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు వెల్లడించారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరినీ ఏకం చేసే లక్ష్యంతో ఆ పార్టీ పనిచేస్తుందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారాన్ని ప్రధాన ధ్యేయంగా తీసుకుని ముందుకు సాగుతామని చెప్పారు.
ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి, ప్రధాన ప్రతిపక్షం తర్వాత తమ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో మూడో ప్రధాన శక్తిగా అవతరిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను నిర్మిస్తామని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో పాటు, ప్రతిపక్షాల వైఖరిపైనా నిర్మాణాత్మక విమర్శలు చేస్తామని పేర్కొన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం అంశంపై కూడా విజయసాయిరెడ్డి స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో లడ్డూ తయారీ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని అంగీకరించారు. అయితే ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందన్న ఆరోపణలను పూర్తిగా ఖండించారు. నెయ్యి కొనుగోళ్ల ధరలు, నాణ్యత అంశాలపై పలు ప్రశ్నలు లేవనెత్తుతూ ప్రస్తుత ప్రభుత్వ వివరణను కోరారు.
నెయ్యి ధరల విషయంలో గతంలో తాము తక్కువ ధరలకు కొనుగోలు చేసినట్లు పేర్కొన్న ఆయన, ప్రస్తుతం అధిక ధరలకు కొనుగోళ్లు జరుగుతున్నాయని అన్నారు. బహిరంగ మార్కెట్‌లో స్వచ్ఛమైన నెయ్యి ధర మరింత ఎక్కువగా ఉంటుందని చెబుతూ, కొనుగోలు ప్రక్రియ పారదర్శకతపై సందేహాలు వ్యక్తం చేశారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కడప జిల్లాలోని కొన్ని ఆలయాల్లో ఇప్పటికీ దళితులకు ప్రవేశం నిరాకరిస్తున్న ఘటనలు ఉన్నాయని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఇలాంటి వివక్షను ఏ మాత్రం సహించబోమని స్పష్టం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆలయాల్లో కుల వివక్షకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే జైలు శిక్షలు విధించేలా చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. సమాన హక్కులు, సామాజిక న్యాయం తమ పార్టీ ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా ఉంటుందని తెలిపారు
RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!