📄 ePaper
Sunday, November 8, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఇంధన పొదుపుతోనే పర్యావరణ పరిరక్షణ! డాక్టర్ కె. సుబ్రహ్మణ్యం

ఇంధన పొదుపుతోనే పర్యావరణ పరిరక్షణ! డాక్టర్ కె. సుబ్రహ్మణ్యం

📰 Generate e-Paper Clip

-విద్యుత్, ఇంధనాన్ని బాధ్యతగా వినియోగించాలి – డాక్టర్ కె. సుబ్రహ్మణ్యం

-మెప్మా ఆధ్వర్యంలో బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాల్లో అవగాహన కార్యక్రమం

నాయుడుపేట, నవంబర్ 2 | సత్యవెలుగు న్యూస్: ఇంధన వనరులను పొదుపుగా వినియోగించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు భవిష్యత్తు తరాలకు సహజ వనరులను అందించవచ్చని నాయుడుపేట ఎల్.ఏ. సాగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డాక్టర్ కె. సుబ్రహ్మణ్యం అన్నారు.

పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) నాయుడుపేట ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాల్లో భాగంగా సోమవారం పట్టణంలోని 24, 25, 26వ వార్డులకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు, స్థానిక ప్రజలకు ఇంధన పొదుపుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వారోత్సవాల్లో రెండో అంశమైన ‘ఇంధనాన్ని ఆదా చేయడం’ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

చిన్న మార్పులతోనే ఇంధన పొదుపు

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ కె. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. అవసరమైనప్పుడు మాత్రమే విద్యుత్ పరికరాలను వినియోగించాలని సూచించారు. తక్కువ దూరాలకు నడక, సైకిల్ ప్రయాణాన్ని అలవాటు చేసుకోవాలని, సాధ్యమైనంత వరకు ప్రజా రవాణాను వినియోగించాలని తెలిపారు. దీనివల్ల ఇంధన పొదుపుతో పాటు ఆరోగ్య పరిరక్షణ కూడా సాధ్యమవుతుందని వివరించారు. ఇళ్లపై సౌర విద్యుత్ పరికరాలను ఏర్పాటు చేసుకుని పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.

మహిళల భాగస్వామ్యం కీలకం

మెప్మా సీఏంఎం సురేంద్ర మాట్లాడుతూ.. స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థిక పొదుపుతో పాటు విద్యుత్, ఇంధన పొదుపుపైనా ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. ఇంధన దహనం వల్ల వెలువడే కర్బన ఉద్గారాలను తగ్గించడం ద్వారా వాతావరణ కాలుష్య నియంత్రణకు సహకరించవచ్చన్నారు. ప్రతి ఇంటిలో ఇంధన పొదుపు అలవాట్లను పెంపొందించాలని సూచించారు.

నవంబర్ 7 వరకు వారోత్సవాలు

ఈ నెల 7వ తేదీ వరకు కొనసాగనున్న బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర జీవన విధానాలను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మెప్మా సీఓలు నారాయణమ్మ, చెంచులత, రిసోర్స్ పర్సన్లు, స్వయం సహాయక సంఘాల మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

సత్యవెలుగు న్యూస్
ప్రజా సమస్యలే మా అజెండా.. నిజాలే మా అక్షరాలు!

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!