-కుటుంబానికి రాజకీయ పునర్జన్మనిచ్చిన తెలుగుదేశం పార్టీకి ఎప్పటికీ రుణపడి ఉంటా…
-పార్టీ నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషితోనే విజయాలు సాధ్యం.
సత్య వెలుగు న్యూస్, నవంబర్ 10: నాయుడుపేట: తమ కుటుంబానికి రాజకీయ పునర్జన్మనిచ్చిన తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ స్పష్టం చేశారు. మంగళవారం నాయుడుపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ.. తన కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ, తాను రాజకీయాలకు దూరంగా ఉంటూ వైద్య వృత్తిలో కొనసాగానని తెలిపారు. అయితే 2024 ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తనను రాజకీయాల్లోకి ఆహ్వానించి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించారని గుర్తు చేసుకున్నారు. రాజకీయ అనుభవం లేకపోయినా తన తండ్రి నెలవల సుబ్రహ్మణ్యం రాజకీయ అనుభవంతో పాటు పార్టీ సీనియర్ నాయకులు కొండేపాటి గంగాప్రసాద్, విజయభాస్కర్ రెడ్డి, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, గ్రామస్థాయి కార్యకర్తలు, తన తండ్రి అభిమానుల సహకారంతో 2024 ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో విజయం సాధించానని పేర్కొన్నారు.
గత రెండున్నరేళ్లుగా పార్టీ నాయకులు, సీనియర్లు, పాత్రికేయుల సూచనలు, సలహాలు తీసుకుంటూ నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తున్నానని తెలిపారు. అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల కోసం నిరంతరం కృషి చేస్తున్నానని, నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఎక్కడా వెనుకడుగు వేయలేదని స్పష్టం చేశారు.
తండ్రిపై తప్పుడు కథనాలు బాధించాయి
పార్టీ అభివృద్ధి, భవిష్యత్తు కోసం నిరంతరం పనిచేస్తున్న తన తండ్రి నెలవల సుబ్రహ్మణ్యంపై కొన్ని పత్రికల్లో వస్తున్న కథనాలు బాధ కలిగిస్తున్నాయని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవాలను తెలుసుకోకుండా తప్పుడు కథనాలు ప్రచురించడం సమంజసం కాదని అన్నారు. ఈ సందర్భంగా ఆమె భావోద్వేగానికి గురయ్యారు.
షాకిరాను చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించాం
నాయుడుపేట పట్టణంలో 786 రఫీ సేవాగుణం కలిగిన వ్యక్తి అని, ప్రజలకు అందుబాటులో ఉండే చురుకైన నాయకుడని ఎమ్మెల్యే ప్రశంసించారు. కొండేపాటి గంగాప్రసాద్, తన తండ్రి నెలవల సుబ్రహ్మణ్యం, తాను కలిసి చర్చించి 786 రఫీ సతీమణి షాకిరాను తెలుగుదేశం పార్టీ తరఫున మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించామని వెల్లడించారు. అయితే కొన్ని క్లిష్టమైన రాజకీయ పరిస్థితుల కారణంగా ఆమెను చైర్మన్‌గా గెలిపించుకోలేకపోయామని విచారం వ్యక్తం చేశారు.
పెళ్లకూరు జడ్పీటీసీ ఓటమికి కారణాలు వివరించిన ఎమ్మెల్యే
పెళ్లకూరు జడ్పీటీసీ స్థానంలో చైతన్య కృష్ణారెడ్డి ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో ఎన్నికల ప్రచారాన్ని ఆశించిన స్థాయిలో నిర్వహించలేకపోయామని, అందువల్ల ఓటమి ఎదురైందని తెలిపారు. అయితే పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, అందరూ సమిష్టిగా కృషి చేశారని పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషితోనే సూళ్లూరుపేట నియోజకవర్గంలో అత్యధిక ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుని పార్టీని విజయపథంలో నడిపించగలిగామని ఎమ్మెల్యే విజయశ్రీ వివరించారు.
ఈ సమావేశంలో సూళ్లూరుపేట నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




