చౌడేపల్లి, సెప్టెంబర్ 15 (సత్య వెలుగు న్యూస్):
చౌడేపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. గుండెపోటుతో సీనియర్ జర్నలిస్టు ఇక్కలూరి రాజేష్ (42) మృతి చెందారు. చౌడేపల్లి సంత గేటు ప్రాంతానికి చెందిన రాజేష్ ప్రజాశక్తి దినపత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు.
గత కొంతకాలంగా రాజేష్ దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఇంట్లో ఉన్న సమయంలో అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు స్పందించేలోపే ఆయన మృతి చెందినట్లు తెలిపారు.
రాజేష్ మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, జర్నలిస్టు మిత్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతునికి అనారోగ్యంతో ఉన్న తండ్రి, తల్లి, భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న రాజేష్ ఆకస్మిక మరణం కుటుంబ సభ్యులకు తీవ్ర ఆవేదనను మిగిల్చింది.
రాజేష్ మృతి విషయం తెలుసుకున్న ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు, స్థానిక ప్రెస్‌క్లబ్ సభ్యులు సంయుక్తంగా ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు తమ వంతు ఆర్థిక సహాయంగా రూ.50 వేల నగదును అందించారు. ఈ సందర్భంగా రాజేష్ జర్నలిస్టుగా అందించిన సేవలను వారు గుర్తుచేసుకున్నారు.
అనంతరం కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, బంధువులు, జర్నలిస్టు మిత్రుల ఆధ్వర్యంలో రాజేష్ అంత్యక్రియలను నిర్వహించారు. ఆయన మృతికి పలువురు జర్నలిస్టులు, స్థానిక ప్రముఖులు సంతాపం తెలిపారు.
రాజేష్ మృతి పట్ల సత్య వెలుగు న్యూస్ తరఫున కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.


