-ఏడేళ్లుగా బిల్డింగ్‌లోనే మగ్గుతున్న కాలం చెల్లిన ఆహార పదార్థాలు..
-పేలుడు శబ్దాలు, విషవాయువులతో ప్రజల్లో ఆందోళన!
నాయుడుపేట, సత్య వెలుగు న్యూస్: నాయుడుపేట పట్టణ నడిబొడ్డున, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. బ్యాంకు అధికారులు సీజ్ చేసిన భవనంలో భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందా? అనే ప్రశ్నలు స్థానిక ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు ఏడేళ్లుగా సీజ్ చేసిన భవనంలో కూల్‌డ్రింక్స్ బాటిళ్లు, చిప్స్ ప్యాకెట్లు, కుర్కురే ప్యాకెట్లు తదితర ఆహార పదార్థాలు నిల్వ ఉండిపోయినట్లు తెలుస్తోంది. ఇంతకాలం నిల్వ ఉన్న ఆహార పదార్థాల నుంచి వాయువులు వెలువడి ఉండవచ్చని, వాటి కారణంగానే పేలుడు శబ్దాలు, భారీగా పొగలు వెలువడి ఉంటాయని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ అగ్నిప్రమాదానికి అసలు కారణం ఏమిటనేది అధికారుల విచారణలోనే తేలాల్సి ఉంది. భవనాన్ని సీజ్ చేసే సమయంలో లోపల ఉన్న వస్తువులను పూర్తిస్థాయిలో పరిశీలించి, ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్న వస్తువులను తొలగించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
అగ్నిప్రమాదం సమయంలో భారీగా పొగలు వ్యాపించడం, పేలుడు శబ్దాలు వినిపించడంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పొగలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.
ప్రజల డిమాండ్ ఏమిటంటే..
పట్టణ నడిబొడ్డున, నిత్యం ప్రజలు రాకపోకలు సాగించే ప్రాంతాల్లో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలి. సీజ్ చేసిన భవనాల్లో నిల్వ ఉన్న వస్తువులను తనిఖీ చేయాలి. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, ప్రమాదానికి గల అసలు కారణాలను వెలుగులోకి తీసుకురావాలని, బాధ్యుల నిర్లక్ష్యం నిర్ధారణ అయితే తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రజల ప్రాణ భద్రతే అధికారుల ప్రథమ కర్తవ్యం కావాలి!




