అంబేడ్కర్ గురించి పుస్తకం ఏం చెబుతుంది?

ఈ పుస్తకం 1940లో అంబేడ్కర్ జీవించి ఉండగానే రాశారు. దాని ప్రచురణ తర్వాత ఆయన మరో 16 సంవత్సరాలు జీవించారు. ఈ కాలంలో ఆయన చాలా ఉద్యమాలకు నాయకత్వం వహించారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. చివరికి బౌద్ధ మతంలోకి మారారు.

1940 తరువాత సంఘటనలు పుస్తకంలో లేవు, కానీ అది దాని ప్రాధాన్యతను తగ్గించదు. అంబేడ్కర్ ప్రారంభ జీవితంతో పాటు ఆయన గురించి చాలా తక్కువగా తెలిసిన అంశాలను ఈ పుస్తకం వివరించింది.

ఉదాహరణకు, పుస్తకంలో నాసిక్‌లో జరిగిన యేవాలా సెషన్ గురించి రాశారు. ఆ సమావేశంలో అంబేడ్కర్: ‘నేను హిందువుగా జన్మించినప్పటికీ, హిందువుగానే చనిపోను’ అనే ప్రకటన చేశారు.

1956లో నాగ్‌పూర్‌లో అంబేడ్కర్ అధికారికంగా బౌద్ధమతంలోకి మారినప్పటికీ, నాసిక్‌లో ఆయన చేసిన ప్రకటన అంబేడ్కర్ ఆధ్యాత్మిక, సైద్ధాంతిక పరివర్తనకు నాంది పలికింది.

ఈ పుస్తకం లాహోర్‌లో జరిగిన ఒక అనూహ్య సంఘటనను కూడా వివరించింది. అక్కడ కులంపై మాట్లాడటానికి జాత్ పాట్ తోడక్ మండల్ అనే సంస్థ అంబేడ్కర్‌ను ఆహ్వానించింది. అయితే, ప్రసంగ పాఠాన్ని చదివిన నిర్వాహకులు దానిని చాలా తీవ్రంగా భావించి అంబేడ్కర్ ఆహ్వానాన్ని రద్దు చేశారు. దీంతో అంబేడ్కర్ అక్కడ ప్రసంగం చేయలేకపోయారు.

అయితే, తరువాత ‘అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్’ అనే పుస్తకంలో ఆ ప్రసంగం ప్రచురితమైంది. ఇది ప్రపంచవ్యాప్తంగా కులతత్వంపై శక్తిమంతమైన విమర్శగా మిగిలిపోయింది.

ఈ మొదటి జీవిత చరిత్ర అంబేడ్కర్ విద్య, భారత్, ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రసిద్ధ ప్రసంగాలు, ప్రపంచ నాయకులు, మేధావులతో ఆయన సంభాషణల గురించి వివరణాత్మక వర్ణనలను అందిస్తుంది.

ఇది మహాత్మాగాంధీ, అంబేడ్కర్ మధ్య సైద్ధాంతిక విభేదాలను కూడా ప్రస్తావిస్తుంది. కులం, మతంపై అంబేడ్కర్ అభిప్రాయాలను పుస్తకంలో క్షుణ్ణంగా చర్చించారు.

ఎన్నెన్నో పుస్తకాలు..

ఇప్పటివరకు డాక్టర్ అంబేడ్కర్ జీవిత చరిత్రలు అనేకం ప్రచురితమయ్యాయి. ఉదాహరణకు, 1946లో డాక్టర్ అంబేడ్కర్ ఫ్రమ్ కరాచీ అనే జీవిత చరిత్రను తానాజీ బాలాజీ ఖరవతేకర్ ప్రచురించారు.

1947లో రామచంద్ర బనౌధ హిందీలో మరొక జీవిత చరిత్రను ప్రచురించారు. ప్రఖ్యాత మరాఠీ చరిత్రకారుడు ధనంజయ్ కీర్ 1954లో ఒక జీవిత చరిత్రను రాశారు. దీనిని ఇప్పటికీ అంబేడ్కర్ జీవితంపై అధికారిక రచనలలో ఒకటిగా పరిగణిస్తుంటారు.

అంబేడ్కర్‌పై ఆయన సన్నిహితుడైన చాంగ్‌దేవ్ ఖైర్‌మోడే 12 భాగాల జీవిత చరిత్రను వివరణాత్మకంగా రాశారు. మొదటి సంపుటి 1952లో ప్రచురితమైంది.

అంబేడ్కర్‌పై అనేక జీవిత చరిత్రలు రాసినప్పటికీ, యు.ఎం. సోలంకి రాసినది మొట్టమొదటిదిగా నిలిచింది.