తిరుపతి రైల్వే స్టేషన్‌కు సంబంధించిన రైల్వే విభాగ కార్యకలాపాలు ప్రస్తుతం గుంతకల్ నుంచి నిర్వహిస్తున్న నేపథ్యంలో, ప్రయాణికుల అధిక రద్దీ కారణంగా వాటిని కొంతవరకు తిరుపతి నుంచే నిర్వహించాల్సిన అవసరం ఉందని తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మద్దిల గురుమూర్తి లోక్‌సభ జీరో అవర్‌లో ప్రస్తావించారు.
తిరుపతి దేశంలోని ప్రధాన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ఉండటంతో పాటు ప్రముఖ విద్యా, వైద్య కేంద్రంగా కూడా నిలిచిందని ఆయన తెలిపారు. తిరుమలకు ఏడాది పొడవునా లక్షలాది మంది భక్తులు వస్తుండటంతో పాటు విశ్వవిద్యాలయాలు, వైద్య విద్యాసంస్థలు ఉండటం వల్ల విద్యార్థుల ప్రయాణాలు కూడా నిరంతరం కొనసాగతాయని సభ దృష్టికి తీసుకెళ్లారు.
తిరుపతి రైల్వే స్టేషన్ మరియు తిరుపతి–రేణిగుంట రైల్వే మార్గం ద్వారా రోజుకు సుమారు లక్షన్నర మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని, దీంతో రైల్వే కార్యకలాపాలు మరియు ప్రయాణికుల నిర్వహణపై అధిక ఒత్తిడి ఏర్పడుతోందని పేర్కొన్నారు. సాధారణంగా రైల్వే పరిపాలనా విధానాల ప్రకారం ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే ప్రధాన స్టేషన్ నుంచే విభాగీయ కార్యకలాపాలు నిర్వహించడం ఆనవాయితీ అని అన్నారు.
అంతేకాకుండా తిరుపతి స్టేషన్ నుంచి ప్రయాణించే ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయం కూడా పలు డివిజన్ కేంద్రాల కంటే ఎక్కువగా ఉందని గుర్తు చేశారు. కేంద్ర మంత్రులు, పార్లమెంటరీ కమిటీ సభ్యులు వంటి ప్రముఖుల తరచు పర్యటనలు కూడా తిరుపతికి జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ప్రత్యక్షంగా రైల్వే విభాగ పర్యవేక్షణ ఉండటం అవసరమని చెప్పారు. అందువల్ల కనీసం వారానికి మూడు రోజులు అయినా రైల్వే విభాగ కార్యకలాపాలను తిరుపతి నుంచే నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంపీ గురుమూర్తి కోరారు.

