వెంకటాచలం: స్వర్ణభారత్ ట్రస్ట్ 25 ఏళ్లుగా నిరుపేదల అభ్యున్నతి, విద్య, సేవా కార్యక్రమాల ద్వారా వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతోందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్ రజతోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌కు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల తరఫున ఆత్మీయ స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ భారత 13వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆశీస్సులు, దీపా వెంకట్ పట్టుదల, కృషితో స్వర్ణభారత్ ట్రస్ట్ 25 ఏళ్ల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాజకీయాలంటే అధికారం మాత్రమే కాదని, ప్రజాసేవతో నిరుపేదల జీవితాల్లో చిరునవ్వులు నింపడమేనని వెంకయ్య నాయుడు నిరూపించారని పేర్కొన్నారు.
అక్షర విద్యాలయం విద్యతో పాటు సంస్కృతి, నైతిక విలువలు, సేవాభావం, దేశభక్తిని విద్యార్థుల్లో పెంపొందిస్తోందని తెలిపారు. యోగీ ఆదిత్యనాథ్ పర్యటన విద్యార్థులు, ఉపాధ్యాయులకు స్ఫూర్తినిచ్చిందన్నారు.
ఈ కార్యక్రమంలో యోగీ ఆదిత్యనాథ్, వెంకయ్య నాయుడు, మంత్రులు పొంగూరు నారాయణ, సత్యకుమార్ యాదవ్, ఎంపీ బీద మస్తాన్ రావు, తదితరులు పాల్గొన్నారు.


