జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్.
తిరుపతి, అక్టోబర్ 22 (సత్య వెలుగు న్యూస్): తిరుపతి జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా నామినేషన్ కేంద్రాల వద్ద ప్రత్యేక పోలీసు బలగాలతో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు.
నామినేషన్ కేంద్రాల పరిసరాల్లో డ్రోన్ కెమెరాలు, సీసీటీవీల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేయడంతో పాటు, పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి భద్రతా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అవసరమైన ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు.
ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ సూచించారు. నామినేషన్ కేంద్రాల వద్ద జనసమూహాల నియంత్రణ, వాహనాల రాకపోకల క్రమబద్ధీకరణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. నామినేషన్ల ప్రక్రియకు ఆటంకం కలిగించినా, ఇతరులను భయభ్రాంతులకు గురిచేసినా, ఘర్షణలకు పాల్పడినా లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా సంబంధిత చట్టాలు, ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా సాగేందుకు అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఏవైనా సమస్యలు ఎదురైనా, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు గమనించినా వెంటనే డయల్ 112 కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

