-న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని తహశీల్దార్ కార్యాలయం ఎదుట వినూత్న నిరసన
చౌడేపల్లి, అక్టోబర్ 3 — సత్య వెలుగు న్యూస్:
రెవెన్యూ శాఖలో ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏలు) చేపట్టిన నిరవధిక సమ్మె శనివారంతో 18వ రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వీఆర్‌ఏల సంఘం ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన శిబిరం వద్ద ఒంటికాళ్లపై నిలబడి ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వీఆర్‌ఏల సమస్యల పట్ల తీవ్ర అలసత్వం వహిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా విధులు నిర్వహిస్తున్న తమకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపుతున్నాయని ఆరోపించారు.
వీఆర్‌ఏల ప్రధాన డిమాండ్లు:
- వీఆర్‌ఏలకు పేస్కేల్ అమలు చేసి ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలి.
- అర్హులైన వీఆర్‌ఏలకు వెంటనే ప్రమోషన్లు కల్పించాలి.
- సర్వీసులో ఉండగా మరణించిన వీఆర్‌ఏల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలి.
- వీఆర్‌ఏలకు కనీస వేతనం రూ.26,000 చెల్లించాలి.
ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేసి, వినూత్న కార్యక్రమాలు చేపడతామని వీఆర్‌ఏల సంఘం నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సుమంత్, రాజన్న, రెడ్డి రాజా, గంగులప్ప, సావిత్రమ్మ, భాస్కర్, రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు.

