2,500 మంది పోలీసులతో భద్రతా చర్యలు – జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్
సత్య వెలుగు న్యూస్, నాయుడుపేట, అక్టోబర్ 31:తిరుపతి నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో నవంబర్ 1వ తేదీన నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ వెల్లడించారు.
శనివారం నాయుడుపేటలోని స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం, కౌంటింగ్ కేంద్రాలను సూళ్లూరుపేట ఆర్డీఓ దేవేంద్ర రెడ్డి, నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ ఫాజీలుల్లాతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఇతర ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను సమీక్షించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి అవసరమైన వసతులు, రవాణా సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నవంబర్ 1వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఓటర్లు తమ ఓటరు స్లిప్పుల్లో పేర్కొన్న పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికే 90 శాతానికి పైగా ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తయిందని వెల్లడించారు.
గర్భిణులు, బాలింతలు, దివ్యాంగులు, వృద్ధులు, మహిళా ఓటర్లకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ నిర్వహణ కోసం ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్ల సేవలను వినియోగించనున్నట్లు వివరించారు.
ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా వ్యాప్తంగా సుమారు 2,500 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. సున్నిత, అత్యంత సున్నిత పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, ప్రత్యామ్నాయంగా వీడియో రికార్డింగ్ సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియను స్వతంత్రంగా పర్యవేక్షించేందుకు ప్రతి పోలింగ్ కేంద్రంలో మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు తెలిపారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా సంబంధిత మున్సిపల్ పరిధిలోని మద్యం దుకాణాలను మూసివేసినట్లు వెల్లడించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తూ సమన్వయంతో విధులు నిర్వహించాలని ఆదేశించారు.
ప్రతి ఓటరు ఎలాంటి భయం, ఒత్తిడి, ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, నాయుడుపేట, ఓజిలి తహసీల్దార్లు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

