-కాళంగి నదిపై నాలుగు వరుసల హైలెవల్ బ్రిడ్జికి అనుమతులు,
-నిధులు కోరిన ఎమ్మెల్యే విజయశ్రీ
నాయుడుపేట, అక్టోబర్ 6,: సూళ్లూరుపేట నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు.
మంగళవారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో టీడీపీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్ నెలవల సుబ్రహ్మణ్యంతో కలిసి ఎమ్మెల్యే విజయశ్రీ సీఎంను కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, మౌలిక వసతులపై చర్చించారు.
ప్రధానంగా సూళ్లూరుపేట పట్టణంలోని కాళంగి నదిపై నాలుగు వరుసల హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన అనుమతులు, నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. ప్రస్తుత రాకపోకల అవసరాలకు అనుగుణంగా ఈ వంతెన నిర్మాణం అవసరమని వివరించారు.
నియోజకవర్గంలోని ఇతర అభివృద్ధి పనులు, ప్రజల అవసరాలకు సంబంధించిన అంశాలను కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కాళంగి హైలెవల్ బ్రిడ్జికి అనుమతులు, నిధుల మంజూరుపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఆమె వెల్లడించారు.

