నాయుడుపేట, అక్టోబర్ 6,: తెలిసిన వ్యక్తి మృతి చెందడంతో కడసారి చూపు కోసం బయలుదేరిన ఓ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన నేలబల్లి గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
వివరాల్లోకి వెళితే.. నేలబల్లి గ్రామానికి చెందిన గోను ప్రసన్నకుమార్ అలియాస్ నందబాబు (54) ఆంధ్రప్రదేశ్ పోలీస్ 9వ బెటాలియన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వెంకటగిరి డివిజన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఆయన, తెలిసిన వ్యక్తి మృతి చెందిన విషయం తెలుసుకుని కడసారి చూపు కోసం డక్కిలి నుంచి వెంకటగిరి వైపు కారులో బయలుదేరినట్లు బంధుమిత్రులు తెలిపారు.
ఈ క్రమంలో డక్కిలి మండలం నాగవోలు గ్రామ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న ఏపీ 40 సీసీ 4166 కారు లారీని ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో నందబాబు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
కడసారి చూపు కోసం బయలుదేరిన నందబాబు.. తానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన ఆకస్మిక మృతితో నేలబల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
నందబాబుకు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

