అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని 100 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలోని 87 మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం ఇప్పటికే పూర్తయింది. మరో 13 పట్టణ స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీకాలం నవంబర్లో ముగియనుంది. దీంతో మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.
బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్
మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రిజర్వేషన్ల అమలుకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించింది. అయితే రిజర్వేషన్ల విషయంలో న్యాయపరమైన అంశాలను కూడా పరిశీలించాల్సిన పరిస్థితి ఉంది.
ఓటర్ల జాబితాలపై కూడా కసరత్తు
ఎన్నికల ప్రక్రియలో భాగంగా వార్డు వారీగా ఓటర్ల జాబితాల తయారీ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, సిబ్బంది శిక్షణ తదితర ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. మున్సిపల్ వార్డు ఓటర్ల జాబితాలను సెప్టెంబర్ 3లోగా ప్రచురించేలా ప్రక్రియ కొనసాగుతోంది.
ఎన్నికల నగారా ఎప్పుడు?
ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ తుది ఎన్నికల షెడ్యూల్, పోలింగ్ తేదీలను రాష్ట్ర ఎన్నికల సంఘమే ప్రకటించాల్సి ఉంటుంది. దీంతో పట్టణ ప్రాంతాల్లో రాజకీయ పార్టీలు, ఆశావహులు ఇప్పటి నుంచే ఎన్నికల కసరత్తును వేగవంతం చేసే అవకాశం ఉంది.
100 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలకు మార్గం సుగమం కావడంతో ఏపీలో మున్సిపల్ రాజకీయాలు మరోసారి వేడెక్కనున్నాయి.


