అమరావతి, అక్టోబర్ 10, సత్య వెలుగు న్యూస్:ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల శాతాలను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక ఆధారంగా వివిధ స్థానాలకు రిజర్వేషన్లను నిర్ణయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది.
కేబినెట్ ఖరారు చేసిన బీసీ రిజర్వేషన్లు
- పంచాయతీ వార్డు సభ్యులు: 26.73%
- గ్రామ సర్పంచ్లు: 27.95%
- ఎంపీటీసీ సభ్యులు: 25.55%
- ఎంపీపీ అధ్యక్షులు: 24.60%
- జెడ్పీటీసీ సభ్యులు: 24.60%
- జెడ్పీ ఛైర్మన్లు: 23.08%
- పట్టణ స్థానిక సంస్థల వార్డులు: 32.78%
- మున్సిపల్ ఛైర్పర్సన్లు: 33.02%
- మేయర్లు: 35.29%
ఎన్నికల నిర్వహణపై ఆసక్తి
స్థానిక సంస్థల్లో బీసీలకు చట్టపరమైన పరిమితులకు లోబడి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. గతంలో 34 శాతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేయగా, ఆ తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ఈ నేపథ్యంలో తాజా రిజర్వేషన్ల ఖరారుకు ప్రాధాన్యత ఏర్పడింది.
కేబినెట్ నిర్ణయంతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు సంబంధించి తదుపరి చర్యలపై ఆసక్తి నెలకొంది. అయితే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే వరకు ఎన్నికల తేదీలు ఖరారైనట్లు భావించరాదు.




