–20 రోజులు గడిచినా పూర్తికాని పనులు..
-చెరువులో నీరు వృథా అవుతుందేమోనని ఆందోళన
పెళ్లకూరు, అక్టోబర్ 3 – సత్య వెలుగు న్యూస్:
పెళ్లకూరు మండలం పాలచూరు గ్రామ చెరువుకట్టకు సంబంధించిన తూము నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో గ్రామస్తులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తూము నిర్మాణం కోసం సుమారు 20 రోజుల క్రితం చెరువుకట్టను తొలగించినప్పటికీ, ఇప్పటివరకు పనులు పూర్తికాకపోవడంపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం చెరువులోని నీటి మట్టం క్రమంగా తగ్గుతుండటంతో రానున్న రోజుల్లో పంటలకు సాగునీరు అందుతుందా లేదా అనే ఆందోళన రైతుల్లో నెలకొంది. తూము నిర్మాణం పూర్తికాకపోవడం వల్ల చెరువులోని నీటిని సక్రమంగా వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని రైతులు పేర్కొంటున్నారు.
ఇప్పటికే సాగు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో తూము నిర్మాణం మరింత ఆలస్యం అయితే పంటలపై ప్రభావం పడే అవకాశం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. చెరువుకట్టను తొలగించిన అనంతరం పనులను వేగంగా పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ, పనులు ముందుకు సాగకపోవడంపై సంబంధిత అధికారుల తీరుపై వారు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
తక్షణమే పనులు పూర్తి చేయాలి
సంబంధిత అధికారులు పలాచూరు చెరువును పరిశీలించి, తూము నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. చెరువులోని నీటిని సంరక్షిస్తూ రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

