– సుమీలో భారీ విధ్వంసం
– ఒకరి మృతి.. పలువురికి గాయాలు
– వందల కోట్ల నష్టం అంచనా
సుమీ, అక్టోబర్ 4 ,సత్య వెలుగు న్యూస్: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారతీయ సంస్థకు చెందిన ఔషధ తయారీ కేంద్రంపై భీకర దాడి జరిగింది. సుమీ నగరంలో ఉన్న కుసుమ్ గ్రూప్ ఔషధ కర్మాగారాన్ని లక్ష్యంగా చేసుకుని రష్యా డ్రోన్లు దాడి చేయడంతో ఒకరు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. కర్మాగారంలోని ప్రధాన నిర్మాణం దాదాపు పూర్తిగా ధ్వంసమైందని స్థానిక అధికారులు తెలిపారు. దాడి జరిగిన ప్రాంతం నుంచి భారీగా పొగలు ఎగసిపడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం పొందుతున్నాయి. సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని శిథిలాల తొలగింపు పనులు చేపట్టాయి. గాయపడిన వారిని సమీప వైద్యశాలలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ దాడి వల్ల సుమారు నాలుగు వందల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఉత్పత్తి విభాగాలు, యంత్రాలు, నిల్వ కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో కర్మాగార కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. రెండేళ్లకు పైగా యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ ఈ కేంద్రం నిరంతరాయంగా ఉత్పత్తి నిర్వహించడం విశేషం. భారతీయ వ్యాపారవేత్త రాజీవ్ గుప్తా ఆధ్వర్యంలో కుసుమ్ గ్రూప్ కార్యకలాపాలు సాగుతున్నాయి. 1994లో భారతీయ ఔషధాలను ఉక్రెయిన్‌కు సరఫరా చేసే సంస్థగా ప్రారంభమైన ఈ సంస్థ, అనంతరం సొంత ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెట్టింది. 2009లో సుమీ నగరంలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి స్థానికంగా ఔషధ ఉత్పత్తిని ప్రారంభించింది.
ప్రస్తుతం ఈ సంస్థ ఉక్రెయిన్‌తో పాటు ఉజ్బెకిస్థాన్, కజకిస్థాన్ సహా తొమ్మిదికి పైగా దేశాలకు యాభై రకాల సాధారణ ఔషధాలను సరఫరా చేస్తోంది. ఉక్రెయిన్ ఔషధ రంగంలో ప్రముఖ స్థానాన్ని సంపాదించిన ఈ సంస్థపై జరిగిన దాడి అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు రష్యా ఇటీవలి కాలంలో తక్కువ వ్యయంతో తయారయ్యే వేగవంతమైన డ్రోన్లతో ఉక్రెయిన్‌పై వరుస దాడులు కొనసాగిస్తోంది. ఈ డ్రోన్లను అడ్డుకోవడం ఉక్రెయిన్ వైమానిక రక్షణ వ్యవస్థలకు సవాలుగా మారింది. అదే సమయంలో ఉక్రెయిన్ కూడా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన కొత్త బాలిస్టిక్ క్షిపణిని ఇటీవల విజయవంతంగా ప్రయోగించినట్లు ప్రకటించడంతో యుద్ధ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి.

