-అభివృద్ధి కోసం సైకిల్ గుర్తుకు ఓటేయండి: టీడీపీ బీసీ నేత జువ్వలపాటి మస్తాన్
నాయుడుపేట, అక్టోబర్ 25 ,సత్య వెలుగు న్యూస్:నాయుడుపేట మున్సిపాలిటీలోని 31వ వార్డులో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి జువ్వలపాటి ఉషకు మద్దతుగా ఆదివారం ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. టీడీపీ బీసీ నేత జువ్వలపాటి మస్తాన్ అభ్యర్థి ఉషతో కలిసి సంజయ్ గాంధీ కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి మహిళలు, పెద్దలను కలుసుకుంటూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి జువ్వలపాటి ఉషను గెలిపించాలని కోరారు.
ఈ సందర్భంగా జువ్వలపాటి మస్తాన్ మాట్లాడుతూ.. 31వ వార్డు అభివృద్ధికి, మహిళా సాధికారతకు జువ్వలపాటి ఉష వంటి నాయకురాలు అవసరమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తున్నారని పేర్కొన్నారు. నాయుడుపేట మున్సిపాలిటీలో టీడీపీ విజయం సాధిస్తే అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి జువ్వలపాటి ఉష మాట్లాడుతూ.. సంజయ్ గాంధీ కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తనకు తెలుసని తెలిపారు. తాగునీరు, డ్రైనేజీ, రహదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మహిళల సమస్యలను అర్థం చేసుకుంటూ వార్డు అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని, తనకు ఒక్క అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు.
ప్రచార కార్యక్రమానికి కాలనీవాసుల నుంచి విశేష స్పందన లభించింది. పలువురు మహిళలు హారతులు పట్టి అభ్యర్థికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా విభాగం సభ్యులు పాల్గొన్నారు.

