నాయుడుపేట, నవంబర్ 3: తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలోని 2వ వార్డు ఎన్నికల ఫలితంపై తీవ్ర వివాదం చోటుచేసుకుంది. తొలుత జరిగిన ఓట్ల లెక్కింపులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మూడు ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. అయితే టీడీపీ అభ్యర్థి రీకౌంటింగ్ కోరడంతో అధికారులు మరోసారి ఓట్లను లెక్కించారు.
రీకౌంటింగ్ అనంతరం టీడీపీ అభ్యర్థి ఆరు ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించడంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫలితంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మరోసారి రీకౌంటింగ్ నిర్వహించాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేశాయి.
ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకునేందుకు ప్రయత్నించగా, పోలీసులు ఆయనను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అరెస్టు చేసినట్లు సమాచారం.
ఈ పరిణామాలతో నాయుడుపేట మున్సిపాలిటీ 2వ వార్డు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తొలుత ప్రకటించిన ఫలితం, రీకౌంటింగ్ అనంతరం వెలువడిన ఫలితంపై రాజకీయంగా చర్చ సాగుతోంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఎన్నికల అధికారులు పూర్తి వివరణ ఇవ్వాలని వైసీపీ శ్రేణులు కోరుతున్నాయి.
*2వ వార్డు ఎన్నికల ఫలితంపై నెలకొన్న వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.*



