చిట్టేడు హత్య కేసులో ఇద్దరికీ జీవిత ఖైదు
ఒక్కొక్కరికి రూ.25 వేల జరిమానా
జరిమానా మొత్తం మృతుడి తండ్రికి చెల్లించాలని కోర్టు ఆదేశం
సీఎంఎస్ పర్యవేక్షణతో సాక్షుల హాజరు.. పోలీసుల సమర్థవంతమైన చర్యలు
కోట, సత్య వెలుగు న్యూస్:కులాంతర వివాహంపై పెంచుకున్న కక్ష ఓ వ్యక్తి హత్యకు దారితీసిన ఘటనలో ఎనిమిదేళ్ల తర్వాత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. తిరుపతి జిల్లా కోట మండలం చిట్టేడు గ్రామంలో 2018 జూన్ 25న జరిగిన హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ ఏడో అదనపు జిల్లా న్యాయమూర్తి కె. వెంకట నాగ పవన్ తీర్పు ఇచ్చారు. ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున జరిమానా విధించారు. ఈ తీర్పుపై చిట్టేడు గ్రామస్తులతో పాటు కోట మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కులాంతర వివాహమే హత్యకు కారణం
కేసు వివరాల ప్రకారం.. ముత్తరాసి కులానికి చెందిన గడి రామయ్య కుమార్తెను బలిజ కులానికి చెందిన కొమ్మ రాజశేఖర్ ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. ఈ వివాహాన్ని రామయ్య, అతడి సోదరుడు గడి వెంకట కిష్టయ్య వ్యతిరేకించినట్లు కేసు దర్యాప్తులో వెల్లడైంది.
ఈ నేపథ్యంలో నాయుడుపేట నుంచి స్వగ్రామానికి వస్తున్న రాజశేఖర్‌ను వెంబడించి, ఇంటి సమీపంలో అడ్డుకున్నట్లు అభియోగాలు నమోదయ్యాయి. వెంకట కిష్టయ్య రాజశేఖర్‌ను పట్టుకోగా, గడి రామయ్య కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు కేసు నమోదైంది.
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అప్పటి సీఐ యు. సత్యనారాయణ విచారణ పూర్తి చేసి న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేశారు.
ఇద్దరికీ జీవిత ఖైదు.. రూ.50 వేల జరిమానా
కేసు విచారణ అనంతరం న్యాయస్థానం గడి రామయ్య, గడి వెంకట కిష్టయ్యలకు జీవిత ఖైదు విధించింది. ఇద్దరికీ కలిపి రూ.50 వేల జరిమానా విధిస్తూ, ఆ మొత్తాన్ని మృతుడి తండ్రికి చెల్లించాలని ఆదేశించింది. జరిమానా చెల్లించని పక్షంలో ఒక్కొక్కరు ఏడాది కఠిన కారాగార శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొంది. రెండు శిక్షలు ఏకకాలంలో అమలు కానున్నాయి.
సీఎంఎస్ పర్యవేక్షణతో పోలీసుల సమన్వయం
జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు గూడూరు డీఎస్పీ నరసింహమూర్తి ఆధ్వర్యంలో కేసును కోర్టు మానిటరింగ్ సిస్టమ్ (సీఎంఎస్) ద్వారా పర్యవేక్షించారు. సాక్షులను సకాలంలో కోర్టుకు హాజరుపరచడం, విచారణకు అవసరమైన సమన్వయం కొనసాగించడం వంటి చర్యలు చేపట్టారు.
ఈ ప్రక్రియలో గూడూరు డీఎస్పీ నరసింహమూర్తి, ఇన్చార్జి సీఐ మాలకొండయ్య, కోట ఎస్ఐ పవన్ కుమార్, కోర్టు లైజనింగ్ అధికారి దానం మల్లికార్జున, కోర్టు కానిస్టేబుల్ అనిల్ బాబు కీలకంగా వ్యవహరించారు. ప్రాసిక్యూషన్ తరఫున కొత్తపల్లి వసంత కుమార్ వాదనలు వినిపించారు.
తీర్పుపై హర్షం.. పోలీసులకు ధన్యవాదాలు
ఎనిమిదేళ్ల తర్వాత బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా న్యాయస్థానం తీర్పు వెలువరించడంపై చిట్టేడు గ్రామస్తులు, కోట మండల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేసు దర్యాప్తు నుంచి సాక్షుల హాజరు వరకు సమన్వయంతో పనిచేసిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.
నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు, నేర నిరూపణకు అవసరమైన దర్యాప్తు, సాక్ష్యాల సేకరణ, కోర్టు సమన్వయానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల పేర్కొన్నారు.

