నాయుడుపేట, అక్టోబర్ 25,సత్య వెలుగు న్యూస్:స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో తెలుగుదేశం పార్టీ అరాచకాలు, దౌర్జన్యాలకు పాల్పడుతోందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. నామినేషన్ల ప్రక్రియలో ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడం సరికాదని ఆయన విమర్శించారు.
ఆదివారం నాయుడుపేటలోని వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, పార్టీ ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశానికి కాకాణి గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు ఆయనకు స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియపై ఆయన మాట్లాడారు.
గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని, ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత కారణంగానే ప్రతిపక్ష అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కాకాణి ఆరోపించారు. మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు పోటీ చేయకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.
నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్లిన అభ్యర్థులపై దాడులు, మహిళా ప్రతినిధుల పట్ల అవమానకర ప్రవర్తన, పోలీసుల సమక్షంలో చోటుచేసుకుంటున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన అన్నారు. టీడీపీ కార్యకర్తలను ముందుంచి నామినేషన్ల ప్రక్రియకు ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ, ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టులాంటివని వ్యాఖ్యానించారు.
ఎన్నికల నిర్వహణలో కలెక్టర్లు, ఎస్పీలు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కాకాణి కోరారు. అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పించి, నామినేషన్ల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయించి ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు కృషి చేస్తామని తెలిపారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. బెదిరింపులకు భయపడకుండా పార్టీ అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలుస్తారని, నాయుడుపేట, సూళ్లూరుపేట మున్సిపాలిటీలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ అభ్యర్థులు ధైర్యంగా పోటీ చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. దాడులు, అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో సూళ్లూరుపేట నియోజకవర్గ పరిశీలకుడు భిరదవోలు శ్రీకాంత్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి తంబిరెడ్డి సుబ్రహ్మణ్య రెడ్డి, నాయుడుపేట టౌన్ అధ్యక్షుడు కలికి మాధవరెడ్డి, జిల్లా కార్యదర్శి కామిరెడ్డి రాజారెడ్డి, నాయుడుపేట రూరల్ అధ్యక్షుడు ఒట్టూరు కిషోర్ యాదవ్, టీఎంఆర్ గ్రూప్ అధినేత తంబిరెడ్డి మోహన్ రెడ్డి, ఓజిలి మండల అధ్యక్షుడు పదార్తి హరినాథ్ రెడ్డి, మాజీ ఎంపీపీ కూరగుండ ధనలక్ష్మి, లీగల్ సెల్ కార్యదర్శి చదలవాడ కుమార్ తదితర వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




