📄 ePaper
Wednesday, September 9, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
HomeEducationఆంధ్రప్రదేశ్‌లో అక్షరాస్యతకు కొత్త ఊపు.. 82.1 శాతానికి పెరుగుదల

ఆంధ్రప్రదేశ్‌లో అక్షరాస్యతకు కొత్త ఊపు.. 82.1 శాతానికి పెరుగుదల

📰 Generate e-Paper Clip

అమరావతి, సెప్టెంబర్ 3: ఆంధ్రప్రదేశ్‌లో అక్షరాస్యతను పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన ‘అక్షర ఆంధ్ర’ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. 2024లో 72.6 శాతంగా ఉన్న రాష్ట్ర అక్షరాస్యత ప్రస్తుతం 82.1 శాతానికి పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. గత ఏడాది కాలంలో సుమారు 25 లక్షల మంది అక్షరాస్యులుగా మారినట్లు ప్రభుత్వం తెలిపింది.

2027 సెప్టెంబర్‌ నాటికి 100 శాతం లక్ష్యం

రాష్ట్రంలో 2027 సెప్టెంబర్‌ నాటికి 100 శాతం అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. వచ్చే ఏడాది మార్చి నాటికి మరో 25 లక్షల మందికి, సెప్టెంబర్‌ నాటికి మిగిలిన 27 లక్షల మందికి అక్షరాస్యత కల్పించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.

11 ప్రభుత్వ శాఖల సమన్వయంతో కార్యక్రమం

‘అక్షర ఆంధ్ర’ కార్యక్రమాన్ని 11 ప్రభుత్వ శాఖల సమన్వయంతో అమలు చేస్తున్నారు. గ్రామస్థాయి నుంచి నిరక్షరాస్యులను గుర్తించి వారికి చదువు, రాతపై అవగాహన కల్పించడంతో పాటు ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులను కూడా కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సూచించారు.

బడి బయట పిల్లలపై ప్రత్యేక దృష్టి

రాష్ట్రంలో ఇంకా 1,64,821 మంది బడి బయట పిల్లలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వారందరినీ గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలని మంత్రి ఆదేశించారు. ఈ ఏడాది ఇప్పటికే సుమారు 33 వేల మంది పిల్లలను పాఠశాలల్లో చేర్పించినట్లు తెలిపారు.

హాజరు పెంపుపై చర్యలు

రాష్ట్రంలో ఉపాధ్యాయుల హాజరు 98.97 శాతం, విద్యార్థుల హాజరు 85.41 శాతంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వరుసగా మూడు రోజులు విద్యార్థి పాఠశాలకు గైర్హాజరైతే తల్లిదండ్రులను పిలిపించి అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు.

అక్షరాస్యత పెంపుతో పాటు ప్రతి చిన్నారిని పాఠశాలకు చేర్చడం, విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం ద్వారా 2027 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను సంపూర్ణ అక్షరాస్య రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!