తిరుపతి, సత్య వెలుగు న్యూస్,సెప్టెంబర్ 29: తిరుపతి నగరంలోని పలు రెస్టారెంట్లు, హోటళ్లలో వాడేసిన వంట నూనెను (Used Cooking Oil) అనధికారికంగా సేకరించి, నగరంలోని కొన్ని ఇళ్లలో వంట పదార్థాలు తయారు చేసి విక్రయిస్తున్నారనే ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది.
వాడేసిన వంట నూనెను తిరిగి ఆహార తయారీలో ఉపయోగిస్తే ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు ఉండే అవకాశం ఉందని, ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు తక్షణమే దృష్టి సారించాలని ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నీరుగట్టు నగేష్ కోరారు.
ఈ మేరకు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార తయారీ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని కోరుతూ తిరుపతి మున్సిపల్ హెల్త్ అధికారిని కలిసి వినతిపత్రం సమర్పించినట్లు ఆయన తెలిపారు.
AAP ప్రధాన డిమాండ్లు
1. వాడేసిన నూనెపై నిఘా:
రెస్టారెంట్లు, హోటళ్లలో వాడేసిన వంట నూనెను సేకరిస్తున్న వ్యక్తులు, సంస్థలపై అధికారులు నిఘా పెట్టాలని కోరారు.
2. అక్రమ ఆహార తయారీపై తనిఖీలు:
ఇళ్లలో అనుమతులు లేకుండా ఆహార పదార్థాలు తయారు చేసి విక్రయిస్తున్న వారిపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, ఆహార భద్రతా ప్రమాణాలు పాటించని వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
3. ప్రజలకు అవగాహన కల్పించాలి:
వాడేసిన వంట నూనెను పదేపదే తిరిగి ఉపయోగించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.
ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశాల్లో అధికారులు నిర్లక్ష్యం చేయకుండా, ఫిర్యాదులపై తక్షణమే స్పందించి తనిఖీలు చేపట్టాలని నీరుగట్టు నగేష్ కోరారు.
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.




