చౌడేపల్లి, సెప్టెంబర్ 17 (సత్య వెలుగు న్యూస్): ప్రత్యామ్నాయ పంటగా ఉలవ సాగును ప్రోత్సహించేందుకు చౌడేపల్లి మండలానికి 400 క్వింటాళ్ల ఉలవ విత్తనాలను 80 శాతం సబ్సిడీపై ప్రభుత్వం కేటాయించినట్లు మండల వ్యవసాయాధికారి తెలిపారు.
ఈ విత్తనాలను సెప్టెంబర్ 18, 2026 నుంచి మండలంలోని అన్ని రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) ద్వారా పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. 10 కిలోల విత్తనాల బస్తా పూర్తి ధర రూ.840 కాగా, సబ్సిడీ రూ.592 పోను రైతు రూ.148 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. 10 కిలోల విత్తనాలు ఒక ఎకరా భూమిలో విత్తుకోవడానికి సరిపోతాయని అధికారులు తెలిపారు.
ఉలవ విత్తనాలను ఇప్పటికే రసాయన మందులతో విత్తన శుద్ధి చేసినందున వాటిని ఆహారంగా లేదా ఇతర అవసరాలకు వినియోగించరాదని రైతులకు సూచించారు.
విత్తనాలు పొందాలనుకునే రైతులు పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డు జిరాక్స్, ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ ఫోన్ తీసుకుని తమ పరిధిలోని రైతు భరోసా కేంద్రానికి వెళ్లాలని మండల వ్యవసాయాధికారి సూచించారు.
ప్రత్యామ్నాయ పంటగా ఉలవ సాగు చేపట్టే రైతులు ఈ సబ్సిడీ విత్తనాల పంపిణీ అవకాశాన్ని వినియోగించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరారు.


