బెల్లంకొండ: మండల పరిధిలోని బెల్లంకొండ గ్రామంలో స్థానిక గ్రామ దేవతల ఆలయం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మూడు రోజుల పాటు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం స్వామివారి చెంత ఉంచిన మహాప్రసాదం లడ్డుకు కమిటీ సభ్యులు వేలం పాట నిర్వహించారు. ఈ వేలంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొనగా, గ్రామానికి చెందిన తెల్లమేకల కోటేశ్వరరావు రూ.20,000 వేలం పాట పాడి మహాప్రసాదం లడ్డును దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ, మహాప్రసాదం లడ్డును వేలంలో దక్కించుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో తమ కుటుంబంతో పాటు గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
అనంతరం గణేష్ కమిటీ సభ్యులు కోటేశ్వరరావును దుశ్శాలువాతో సన్మానించి మహాప్రసాదం లడ్డును అందజేశారు. కార్యక్రమంలో గణేష్ కమిటీ సభ్యులు జవాజి పాపయ్య, కందుల వెంకటేష్, పిన్నబోయిన శ్రీనివాసరావు, జవాజి శివరామకృష్ణ, ముసుగు శీను, కందుల సాయి, తెల్లమేకల హనుమంతరావు తదితరులు, గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


