సత్య వెలుగు న్యూస్ ,ఓజిలి: తిరుపతి జిల్లా ఓజిలి మండలం సగుటూరు ఎంపీటీసీ సెగ్మెంట్ నుంచి బహుజన సమాజ్ పార్టీ (BSP) అభ్యర్థిగా పోటీ చేసిన నాగిశెట్టి తులసమ్మ ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. సగుటూరు ఎంపీటీసీ సెగ్మెంట్ పరిధిలోని వీర్లగునపాడు పోలింగ్ కేంద్రం నంబర్ 16/23 లో పోలింగ్ అధికారిగా విధులు నిర్వహించిన వై. సుబ్బారెడ్డి స్థానిక నాయకులతో కుమ్మక్కై వ్యవహరించారని ఆరోపించారు.
బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి నాగిశెట్టి తులసమ్మకు తెలియకుండా, ఆమె అనుమతి లేకుండానే బీఎస్పీ తరఫున ఇద్దరు ఏజెంట్లను నియమించి ఎన్నికల ప్రక్రియను కొనసాగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అంతేకాకుండా, సదరు ఏజెంట్లకు ఫోర్జరీ సంతకాలతో గుర్తింపు కార్డులు జారీ చేసినట్లు గుర్తించామని ఆమె ఆరోపించారు.
ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని నాగిశెట్టి తులసమ్మ మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కోరినట్లు తెలిపారు.
ఎన్నికల పారదర్శకతను కాపాడాలి.. అక్రమాలపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలి అని ఆమె కోరారు.



