–ప్రజాతీర్పును గౌరవిస్తూ పారదర్శకంగా ఫలితాలు ప్రకటించాలి
-ఆమ్ ఆద్మీ పార్టీ నేతల డిమాండ్
సూళ్లూరుపేట, నవంబర్ 2 | సత్యవెలుగు న్యూస్: సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాలిటీలకు నవంబర్ 3వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా, పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు పాలేటి వెంకటస్వామి, సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్‌చార్జి పట్టపురవి డిమాండ్ చేశారు.
నవంబర్ 1వ తేదీన రెండు మున్సిపాలిటీల్లో బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించిన నేపథ్యంలో, ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ఎన్నికల అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు కోరారు. ప్రజలు తమ ఓటు ద్వారా వెలిబుచ్చిన అభిప్రాయం ఏమాత్రం తారుమారు కాకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల యంత్రాంగంపై ఉందన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటుకు ఎంతో విలువ ఉంటుందని, ప్రజల విలువైన తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమై ఉందని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్‌కు సంబంధించిన ఫలితాలను ప్రజలకు స్పష్టంగా తెలిసేలా సమాచార బోర్డులు ఏర్పాటు చేయాలని, ఫలితాలను ఎప్పటికప్పుడు మీడియాకు వెల్లడించాలని సూచించారు.
రాజకీయ పార్టీల ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో ఎన్నికల నిబంధనల ప్రకారం లెక్కింపు చేపట్టాలని, ప్రతి బ్యాలెట్ పేపర్‌ను జాగ్రత్తగా పరిశీలించి లెక్కించాలని కోరారు. ఎలాంటి పొరపాట్లు, అవకతవకలు జరగకుండా ప్రజలు ఇచ్చిన తీర్పును యథాతథంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగి ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు.




